ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం
రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండ టంతో ఒక తండ్రిగా, నటుడిగా తనకెంతో గర్వంగా ఉందంటూ చిరంజీవి సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. “నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా పెద్ది దగ్గరే ఉంది. రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, పెట్టిన శ్రద్ధాసక్తులన్నీ దగ్గర నుంచి చూశా.
ఈరోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగానే కాదు, నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం” అని రామ్ చరణ్‌ను ప్రశంసించారు చిరంజీవి. మెగాస్టార్ ఇంకా మిగతా నటీనటులు, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక బృందాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిచారు. ‘పెద్ది’ సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకు గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.






