ధాన్యం కొనడం చేతకాదా?
- వడ్లను కొనకుండా రైతులకు ఇంకేం మేలు చేస్తారు?
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్రం లో వడ్ల కొనుగోలుకు అవసరమైన సొమ్మం తా కేంద్రమే ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కొనడం చేతనైతలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. బుధవారం బొమ్మకల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘వడ్లు కొనుగోలు చేయడం చేతగాకపోతే అదే విషయాన్ని కేంద్రానికి చెపుతూ సీఎం లేఖ రాయండి.
ఆ తరువాత జరిగే పర్యవసానాలను చూసుకుందాం’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్లే రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అరిగోస పడుతున్నారు. నెలన్నర రోజుల నుండి వడ్లను తీసుకొచ్చిన కొనుగోలు కేంద్రాల్లో ఉంచినా కొనే నాథుడే లేకుండా పోయారన్నారు. ఈ నెలాఖరులోగా వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తే దేనికైనా సిద్ధమే అని సవాల్ చేశారు. తడిసిన వడ్లకు తరుగు, తాళు, తేమ లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలన్నారు.
సింగరేణి ఆఫీసులను ధ్వంసం చేయాలని, రైలు పట్టాలని కోసేయాలని, జీఎం ఆఫీసు తగలబెట్టాలంటూ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పడం దుర్మార్గమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ తీరుకు సుమన్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ చేసే కార్యక్రమాలకు ప్రజలెవరూ రావడం లేదని తేలిందన్నారు.
వరంగల్‌కు కేంద్రం అత్యధిక నిధులు
హనుమకొండ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు ఇచ్చింది వరంగల్ కార్పొరేషన్‌కేనని బండి సంజయ్ అన్నారు. నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ పాలకుల అవినీతివల్ల ఆ నిధులన్నీ దుర్వినియోగమయ్యా యని మండిపడ్డారు. వరంగల్‌లో బుధవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడి అధికారంలో రావడమే బీజేపీ లక్ష్యం అన్నారు.






