28 May, 2026 | 1:55 AM

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

28-05-2026 12:03 AM
  1. తడిసిన ధాన్యం కొనాలి
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొను గోలు కేంద్రాలను మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే కల్లాల్లో ధాన్యం తడిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా పరస్పరం నెపం నెట్టుకుంటూ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

అకాల వర్షాలతో తడిసిన వడ్లు మొలకెత్తే ప్రమాదం ఉందని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన బాయిల్ రైస్ మిల్లులకు తరలించాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెట్టితేనే దించుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఏ-గ్రేడ్ వడ్లను కూడా బీ-గ్రేడ్గా నమోదు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని, క్వింటాల్కు 3 నుంచి 5 కిలోల తరుగు పేరుతో వేలాది రూపాయలు నష్టపరుస్తున్నారని అన్నారు.

రవాణా, హమాలీ, ట్రాక్టర్ వెయిటింగ్, కాంటా ఛార్జీలు అన్నీ రైతులపై మోపుతూ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. మొదట 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 70 లక్షల టన్నులకే పరిమితం కావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా కేంద్రం కేవలం 51 లక్షల టన్నుల కోటానే ఇచ్చిందన్నారు. బీజేపీ ఎంపీలు ఇక్కడ ధర్నాలు చేయడం కాకుండా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కోటా పెంచాలని పోరాడాలని సూచించారు.

ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి

జనగామ (విజయక్రాంతి): జనగామ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచిన ధాన్యం, మక్కలు నిన్న కురిసిన అకాల వర్షాల తో పూర్తిగా తడిసిపోయాయిని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకె ళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం తార్పాలిన్లు, గోనె సంచులు, రవాణా సౌకర్యాలు కల్పించలేదన్నారు.