28 May, 2026 | 1:55 AM

నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం

28-05-2026 12:00 AM

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

చూసీ చూడనట్టు వ్యవహరించండి.. అధికార పార్టీకి చెందిన ఓ నేత హుకుం

తాండూర్, మే 27,(విజయక్రాంతి): చట్టం కళ్లున్నా గుడ్డిది..అనే సామెతను  వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ అధికారులు నిజం చేస్తున్నారు. పట్టణంలో  నిబంధన లకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం జరుగుతున్నా అధికారులు ‘ఈరోజు...రేపు’ అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

అసలు విషయం: 

తాండూర్ మున్సిపల్ పరిధిలోని పట్టణంలో నడిరోడ్డున ఉన్న నెహ్రూ గంజ్, శ్రీ ఎల్లమ్మ దేవాలయం ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ నిర్మాణం  పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణంతో పక్క భవనాలకు ప్రమాదం కలిగేలా భారీ సెల్లార్ కోసం తవ్వకాలు చేపట్టారు. దీనిపై స్థానికులు  ఫిర్యాదు చేశారు. 

  అయితే అధికారులు ‘ఈరోజు వెళ్తాం, రేపు చూస్తాం’ అని మాట దాటవేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా వేయడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారుల ఈ జాప్యాన్ని అడ్డుపెట్టుకుని నిర్మాణదారులు రాత్రింబవళ్లు పనులు చేసుకుంటూ పోతున్నారు. 

ప్రజల ఆవేదన: 

మేము చెప్తే పట్టించుకోరు. ఏదైనా ప్రమాదం జరిగి పక్క ఇల్లు కూలితే అప్పుడు వచ్చి పరిశీలిస్తారా? అనుమతి లేకుండా తవ్వుతుంటే ఆపాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత అక్రమ సెల్లార్ నిర్మాణం చేస్తున్న వ్యక్తి ‘మనోడే‘నని చూసి చూడనట్లు వ్యవహరించండి అంటూ సంబంధిత అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం.

ప్రమాద ఘంటికలు: 

అనుమతి లేని సెల్లార్ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు దెబ్బతినడంతో పాటు, పక్కనున్న పాత భవనాలు కుంగిపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో నీరు చేరితే మరింత ప్రమాదమని చెబుతున్నారు.

డిమాండ్: 

ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న సెల్లార్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కలెక్టర్కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఏమంటున్నారంటే..ఈ విషయంమై మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని వివరణ కోరగా కులగణన,  తదితర సమావేశాలతో బిజీగా ఉండడంతో అటువైపు వెళ్లలేదని..నేడొ, రేపో క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు చూసుకుంటామని తెలిపారు.