ఇందూరు స్థానం.. బీజేపీ కైవసం
నిజామాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీ సాధించారు. అరవింద్ 5,92,318 ఓట్లు రాబట్టగా, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి 4,83,077 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ 1,02,406 ఓట్లు సాధించారు. అరవింద్ క్రికెటర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టి, రాజకీయాల్లోకి వచ్చారు.
చిత్తుగా ఓడిన బీఆర్‌ఎస్..
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటలేకపోయింది. నిజామాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ కేవలం 8.33 శాతం ఓట్ల సాధించి డిపాడిట్ కోల్పోవడం గమనార్హం. ఎన్నికల్లో మొత్తం 12,33,581 ఓట్లు పోల్ అవగా, బాజిరెడ్డికి కేవలం 1,02,406 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాజకీయ ప్రవేశం..
కాంగ్రెస్ నేత, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ప్రోద్బలంతో రాజకీయాలను తన కెరీర్‌గా ఎంచుకున్నారు. 2019లో అరవింద్ మొదటిసారిగా బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ఓడించి విజయ కేతనం ఎగురవేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌పై ఓటమి పొందారు. 2024లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు ఎంపీలుగా తాడూరి బాలాగౌడ్, మధుయాష్కీగౌడ్ గెలిచారు. అలా గెలిచిన వారిలో అరవింద్ మూడోవారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా..
ధర్మపురి అరవింద్‌కు సహజంగానే ప్రత్యర్థులపై దూకుడుగా మాటల దాడి చేస్తారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతూనే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పక్కా విజయానికి ప్రణాళిక రచించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డికి దీటుగా ప్రచారం నిర్వహించారు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన కాలంలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌కు అసలు డిపాజిట్టే రాకుండా ప్రచారంలో దూసుకుపోయారు.






