ఆర్నెల్లు అద్దంలో ముఖం చూసుకోలేకపోయా
అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొంటూ బాలీవుడ్‌లో తమదైన ముద్ర వేసిన నటీమణుల్లో విద్యాబాలన్ ఒకరు. తాజాగా ‘భూల్‌భులయ్యా 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారామె. “చక్రం’ అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చా. అందులో మోహన్‌లాల్ హీరో. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోతో చేస్తున్నానని చాలా మంది మేకర్స్ నాకు అవకాశాలిచ్చారు.
కాని అనుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ‘చక్రం’ షూటింగ్ స్టేజ్‌లోనే ఆగిపోయింది. దాంతో మిగతా సినిమాల్లోనూ నన్ను తీసేశారు. ఏం జరుగుతోందో తెలియక అర్థం కాక కుంగుబాటుకు గురయ్యారు. మూడేళ్లు బాధపడ్డా. తర్వాత మరో తమిళ చిత్రంలో అవకాశం రావడంతో కొన్ని రోజుల షూటింగ్‌లో పాల్గొన్నా. ‘చక్రం’ ఆగిపోయిన విషయం తెలిసి ఆ నిర్మాత నా జాతకం చూపించాడు.
మా సినిమాకు సెట్ కావని చెప్పి ఆ ప్రాజెక్టు నుంచి తొలగించాడు. ఆ విషయం తెలిసి మా అమ్మానాన్నలతో కలిసి వెళ్లి ఆయన్ను కలిశా. సినిమా కోసం షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు చూపిస్తూ.. ‘ఒక్కసారి ఆమె ముఖం చూడండి హీరోయిన్‌లా ఎక్కడైనా కనిపిస్తుందా? డ్యాన్స్ రాదు.. యాక్టింగ్ రాదు’ అంటూ అవమానించాడు.
ఆ మాటలతో ఆర్నెల్లు అద్దంలో చూసుకోలేకపోయా. నాపై నాకే అసహ్యం వేసింది. అలా ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు ప్రదీప్ సర్కార్ నాకు అండగా నిలిచారు. యాడ్‌షూట్స్, సినిమాల్లో అవకాశం ఇచ్చారు” అని చెప్పకొచ్చింది విద్యాబాలన్.




