15 August, 2026 | 5:48 PM

వనపర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

15-08-2026 05:17 PM

వనపర్తి, ( విజయక్రాంతి ) : పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తి ఐడీఓసీలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 1,83,013 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 26,465 కొత్త రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి తదితర పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రేషన్ షాపు, రేషన్ వివరాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.