బసంత్‌నగర్ టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం
గంగ స్నానం చేసి వస్తుండగా లారీ ఢీ...
తల్లి, కుమారుడికి తీవ్ర గాయాలు
కాళ్లు, చేతులు నుజ్జునుజ్జు.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
పెద్దపల్లి, ఆగస్టు 15 (విజయక్రాంతి): గంగ స్నానానికి వెళ్లి కుటుంబంతో ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమైన వేళ ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. బసంత్‌నగర్ టోల్‌గేట్ దాటిన అనంతరం వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన పినాక్షి సతీష్ తన భార్య స్వప్న, కుమారుడు విక్కీతో కలిసి మోటార్‌సైకిల్‌పై గోదావరిఖనికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బసంత్‌నగర్ టోల్‌గేట్ దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్ వెనుక కూర్చున్న స్వప్న, ఆమె కుమారుడు విక్కీ తీవ్రంగా గాయపడ్డారు. స్వప్న కుడికాలు తీవ్రంగా నుజ్జునుజ్జు కాగా, విక్కీ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు వెంటనే స్పందించి హెచ్‌కేఆర్ టోల్‌గేట్ అంబులెన్స్‌ను రప్పించారు. క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదకరంగా మారిన ఈ ప్రాంతంలో వాహనాల వేగ నియంత్రణకు, భద్రతా చర్యలకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






