15 August, 2026 | 6:34 PM

గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపు

15-08-2026 05:14 PM

గద్వాల, (విజయక్రాంతి) : జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గద్వాల పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ప్రధానంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ఈ నెల 14న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచుతూ రూ.1,781 కోట్లతో రీ-డిజైన్‌కు కూడా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో 58,113 మంది రైతులకు రూ.513.99 కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద 1,72,417 మంది రైతులకు రూ.263 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 6,795 ఇళ్లు మంజూరు కాగా 649 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, చేయూత, రూ.500కే గ్యాస్ తదితర సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నట్లు తెలిపారు.

గద్వాలలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, క్రిటికల్ కేర్ యూనిట్, రహదారులు, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.