చెత్త బండికి హెలికాప్టర్ రెక్కలు.. హుస్నాబాద్‌కు అవార్డు కిరీటం!
‘డ్రై హెలీ’ వినూత్న ప్రయోగానికి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ప్రతిష్టాత్మక పురస్కారం
హుస్నాబాద్, ఆగస్టు 15 : వ్యర్థాల సేకరణలో వినూత్న ఆలోచనతో హుస్నాబాద్ మున్సిపాలిటీ మరో ఘనత సాధించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, డ్రై వేస్ట్ సేకరణతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ‘డ్రై హెలీ’ శకటానికి శనివారం ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.సాధారణ తోపుడు బండిని హెలికాప్టర్ ఆకారంలో రూపొందించి ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ప్రజల్లో పర్యావరణ చైతన్యం కల్పిస్తున్న ‘డ్రై హెలీ’ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రవికుమార్, జవాన్ పైస శ్రీకాంత్, సిబ్బంది అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.






