కాళేశ్వరంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు
పరిశీలించిన రీజినల్ జాయింట్ కమిషనర్..
మహదేవపూర్: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం క్షేత్రంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం దేవస్థానంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇది 42 సంవత్సరాల తరువాత జరుగుతున్న కార్యక్రమమని.. దీనిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ, డిప్యూటీ కమిషనర్ సుమలత, డీపీవో నారాయణరావు, ఈవో మహేశ్, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.






