20-01-2026 06:35:34 PM
సీసీఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాలలో రీ సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని సిసిఎల్ఎ కార్యాలయం నుండి రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), సర్వే ల్యాండ్ అధికారులతో భూభారతి గ్రామాల రి సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సి సి ఎల్ ఎ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాల వారీగా రీ సర్వేకు ఎంపికైన గ్రామాలలో ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్లను ఆయా మండలాలకు కేటాయించాలని, 2వ గెజిట్ నోటిఫికేషన్ జారీ అనంతరం పూర్తి శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేపట్టాలని, 22ఎ జాబితాను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. విజయ్ కుమార్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నక్షాలు లేని 37 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, మొదటి విడతలు ఈ గ్రామాలలో రీ సర్వేకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. 2వ గెజిట్ నోటిఫికేషన్ జారీ తర్వాత కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, లైసెన్సుడ్ సర్వేయర్లను మండలాల వారీగా కేటాయించి సమన్వయం చేసుకుంటామని తెలిపారు. 22 ఎ నిషేధిత భూముల జాబితాను సి సి ఎల్ ఎ కు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబందించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.