13 March, 2026 | 11:49 AM

వేతనం కోసం వెతలు...!

13-03-2026 10:42 AM

పార్ట్‌టైమ్ జూనియర్ లెక్చరర్ల ఆవేదన

మార్చి నెల పూర్తి జీతం మంజూరు చేయాలని విన్నపం

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ జూనియర్ లెక్చరర్లు వేతనం కోసం వెతలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.ఏడాది మార్చి 13 న ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో వారికి నెల మొత్తానికి జీతం చెల్లించాల్సి ఉండగా కేవలం 13 రోజుల వేతనం మాత్రమే అందించేందుకు సొసైటీ చర్యలు తీసుకోవడంతో అందులో విధులు నిర్వహించిన పార్ట్ టైం పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు మార్చి నెల పూర్తి జీతం మంజూరు చేయాలని అధికారులను కోరుతూ విన్నపం చేస్తున్నారు.

 రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు... 

సాంఘిక సంక్షేమ కళాశాలలో పార్ట్‌టైమ్ అధ్యాపకులు/ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. వారు బోధనతో పాటు సూపర్‌విజన్ స్టడీ, సెల్ఫ్ స్టడీ, నైట్ స్టే డ్యూటీలు, హాలిడే డ్యూటీలు, మెస్ డ్యూటీలు, హౌస్ మాస్టర్ డ్యూటీలు, ఎస్కార్ట్ డ్యూటీలు వంటి అనేక అదనపు బాధ్యతలను చేపడుతున్నారు.తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 13న ముగియనున్నాయి.  తమకు మార్చి నెలలో కేవలం 13 రోజుల జీతం మాత్రమే లభించే పరిస్థితి ఉందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్‌ను ఆధారంగా తీసుకుని, ఈసారి కూడా మార్చి నెలకు పూర్తి జీతం మంజూరు చేయాలని కోరారు. 2025–26 విద్యా సంవత్సరంలో తాము నిర్వహించిన విధులను పరిగణనలోకి తీసుకుని పూర్తి జీతం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్రైబల్ వెల్ఫేర్ లో పూర్తి వేతనం..

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు మార్చి నెలకు సంబంధించి పూర్తి వేతనం ఆ సొసైటీ అందజేస్తున్నట్లు తెలిసింది. రెండు సొసైటీలలో ఒకే విధమైన విధులు ఉన్నప్పటికీ ఈ సొసైటీల తీరు మాత్రం ఒకే విధంగా లేకపోవడం గమనార్హం.వేతనాలలోను వ్యత్యాసం ఉండడమే కాకుండా సెలవుల ప్రకటనలోనూ సొసైటీలు వేరువేరుగా వ్యవహరించడం పట్ల అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంటుంది.సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు ,సొసైటీలు వాటిని పట్టించుకోకపోవడంతో పార్ట్ టైం,గెస్ట్,అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తీవ్రంగా ఆర్థికంగా వెనుకబడుతున్నారు.ఇప్పటికైనా విద్యాసంస్థల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనారిటీ సొసైటీలో ఒకే విధానం అమలు చేయాలని డిమాండ్లు లేకపోలేదు.