ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 27(విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కె. హరి త అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మా ట్, డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆర్డీఓ లోకేశ్వర్ రావు, డీఎస్పీ అశోక్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో పర్యటన ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 1న కెరమరి మండలం కొటారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, లబ్ధిదారుల తో భోజనం, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద ప్రముఖులకు స్వాగతం, షామియానాలు, పార్కింగ్, గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారులపై గుంతలను వెంటనే పూడ్చాలని ఆదేశించారు.
అదే రోజు సాయంత్రం కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో జరిగే బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని తెలిపారు.హెలిప్యాడ్ వద్ద భారీ కేడింగ్, వైద్య బృందాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.కొటారి గ్రామం నుంచి కాగజ్నగర్ సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రానున్నందున మార్గమధ్య ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. సభలో ప్రముఖుల గ్యాలరీ, వీడియో గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈనెల 29న రెబ్బెన మండలం రౌట సంకెపల్లిలో తెలంగాణ గవర్నర్ పర్యటన నేపథ్యంలో కూడా ఏర్పాట్లపై సమీక్షించారు. గవర్నర్ హెలికాప్టర్ ద్వారా రానున్నందున హెలిప్యాడ్ వద్ద అంబులెన్స్ కాన్వాయ్ సిద్ధంగా ఉంచాలని, కలెక్టరేట్ వద్ద పోలీసు గౌరవ వందనం నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్యుత్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.






