28 May, 2026 | 1:54 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

28-05-2026 12:31 AM

కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ మే 27 ( విజయక్రాంతి)జిల్లాలో మిగిలి ఉన్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సోన్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, ఐకేపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.కేంద్రానికి వచ్చిన ధాన్యం పరిమాణం, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, తేమ శాతానికి వచ్చి ఇంకా తూకం వేయాల్సిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.అంతకుముందు జాఫ్రాపూర్ గ్రామంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వస్తున్న ధాన్యం లారీల అన్లోడింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. మిల్లుల వద్ద వేచి ఉన్న లారీల వివరాలు, అన్లోడింగ్ వేగంపై అధికారులను ఆరా తీశారు. పౌరసరఫరాలు, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.అనంతరం మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని రైస్ మిల్లులు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియలను వెంటవెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసిల్దార్లు సంతోష్, శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.