అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్
చాకచక్యంగా పట్టుకున్నసైబర్ క్రైం పోలీసులు
నిందితుల నుంచిరూ.3.12 కోట్ల నగదు సీజ్
విద్యావంతులే లక్ష్యంగాసైబర్ మోసాలు
వారిపై దేశవ్యాప్తంగా600 కేసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాల గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. తక్కువ పెట్టుబడులకు అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడుతున్న రెండు కేసుల్లోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్టాక్ ట్రేడింగ్‌లో సహకరిస్తామని నమ్మిస్తూ ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.కోట్లలో కొల్లగొడుతున్నారని సీపీ తెలిపారు. ఈ మోసగాళ్ల బారినపడి రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 213 మంది బాధితులు రూ.27.4 కోట్లు పోగొట్టుకున్నారని తెలిపారు.
ఉన్నత చదువులు అభ్యసించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. బాధితులను వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చుతూ, అప్పటికే ఆయా గ్రూపుల్లో తమ ముఠా సభ్యులను ఉంచి, ఉచితంగా స్టాక్ ట్రేడింగ్ మెలకువలు నేర్పిస్తామంటూ నమ్మిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. మరోవైపు తాము భారీగా లాభాలు ఆర్జించామని గ్రూపులోని ముఠా సభ్యులు పోస్ట్‌లు పెడుతూ నకిలీ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తున్నారని, అది నిజమని నమ్మి ఎవరైనా ఆసక్తి చూపితే పెట్టుబడి పెట్టిస్తూ లాభాలు విరివిగా వచ్చినట్లు ఆన్‌లైన్ ఖాతాలో చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నరన్నారు. ఒకవేళ తమ ఖాతాలో ఉన్న లాభాల్ని విత్‌డ్రా చేసుకోవాలంటే మాత్రం పన్నులు చెల్లించాలని నమ్మిస్తూ వీలైనంతా లాగేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.
ఎవరైనా బాధితులు ఒత్తిడి చేస్తే గ్రూప్‌లో నుంచి నంబరును తొలగిస్తుంటారని వివరించారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని సీపీ వారిని అభినందించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన నిందితులు.. మంగిలాల్ గొదారా(36), భజన్ గొదారా(33) అలియాస్ భజన్, కమలేశ్‌కుమార్(29) అలియాస్ మహేశ్‌కుమార్, ప్రకాశ్ చంద్(32), బురా రామ్ బనేవాల్ (25) అలియాస్ రాజుబాయ్, రామచంద్ర అలియాస్ గణేశ్‌రామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నామని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులపై దేశవ్యాప్తంగా 599 వరకు కేసులు ఉన్నట్లు గుర్తించమన్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3.12 కోట్లు సీజ్ చేశామని, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టారని పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని సీపీ పేర్కొన్నారు. నిందుతులను కోర్టులో హజరుపర్చి, రిమాండ్‌కు తరలించామన్నారు.






