14 July, 2026 | 8:34 PM

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి

14-07-2026 08:31 PM

 - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ల పరిధిలో సమాచార వ్యవస్థ (ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్)ను మరింత బలోపేతం చేసి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. మంగళ వారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ మాట్లాడారు. గంజాయి, గ్యాంబ్లింగ్, గేమింగ్, అక్రమ రాయితీ బియ్యం రవాణా, ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన నిఘా కొనసాగించాలని, నాణ్యమైన దర్యాప్తుతో శిక్షల శాతం పెంచి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.

రాబోయే ఆరు నెలల కాలానికి ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. జిల్లాలో గంజాయి రహిత వాతావరణం ఏర్పడేలా కఠిన చర్యలు కొనసాగించాలని, గంజాయి వ్యాపారులు, వ్యసనపరులను గుర్తించి చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైన వారికి డి-అడిక్షన్ కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించాలని తెలిపారు. అదేవిధంగా గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ గేమింగ్, అక్రమ రాయితీ బియ్యం రవాణా, ఓపెన్ డ్రింకింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. నమోదైన ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా శాస్త్రీయ ఆధారాలతో కేసులను బలోపేతం చేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శిక్షల శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

ఆర్థిక నేరాల కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు నష్టం పూడ్చే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు. వర్టికల్ విధానంను సమర్థవంతంగా అమలు చేస్తూ కేసుల్లో ఎలాంటి పెండెన్సీ లేకుండా పర్యవేక్షించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో సమానంగా వ్యవహరించాలని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ప్రతి అధికారి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ప్రతి మండలంలో, గ్రామాలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, బ్లూ కోల్ట్ బృందాల ద్వారా రాత్రి గస్తీని మరింత పటిష్టం చేసి ఆస్తి నేరాలు, ఇతర నేరాల నివారణపై దృష్టి సారించాలని ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ అక్క, ఖాకీ కిడ్స్ కార్యక్రమాల ద్వారా మహిళల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, రోడ్డు భద్రతపై విస్తృత స్థాయిలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

గత ఆరు నెలల కాలంలో జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడంలో కృషి చేసిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్పూర్తితో రాబోయే రోజుల్లో కూడా ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) పి. మౌనిక ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, ఎం. వెంకట నరసయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, డీసీఆర్‌బీ, ఎన్ఐబీ, ఫింగర్ ప్రింట్, రిజర్వ్, కమ్యూనికేషన్, ఐటీ కోర్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.