భిక్కనూర్‌లో అక్రమ మొరం తవ్వకాల కలకలం
నంబర్ ప్లేట్ లేని జేసీబీతో ప్రభుత్వ కుంటలో తవ్వకాలు.. అనుమతులపై భిన్న వాదనలు
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ కుంటలో నంబర్ ప్లేట్ లేని జేసీబీతో మొరం తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని తవ్వకాలను నిలిపివేశారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ నజీముద్దీన్, జీపీఓ రమేష్ తదితరులు పరిశీలించారు. ఎమ్మార్వో మాత్రం రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొనగా,
ఓ ప్రజాప్రతినిధి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెప్పడం వివాదానికి దారితీసింది. ఇదే సమయంలో అధికారులు వచ్చేలోపే కొన్ని వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయని స్థానికులు చెబుతున్నారు. నంబర్ ప్లేట్ లేని జేసీబీ ఎలా పనిచేసింది? పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని చెప్పిన వాహనాలు ఎక్కడికి వెళ్లాయి? నిందితులపై కేసులు నమోదయ్యాయా? అనే అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.






