23-02-2026 12:05:10 AM
ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్
సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 22 : రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రతిఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ’అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సిద్దిపేట రాజీవ్ రహదారిపై పొన్నాల ఫ్లైఓవర్ వద్ద వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పాల్గొని ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. 50 సంవత్సరాల వయస్సు గల ఒక ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణించడం గమనించి ఆయనను అభినందించారు.
రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని స్పష్టం చేశారు. హైవేలపై ప్రయాణించేటప్పుడు లైన్ డిసిప్లిన్ పాటించడం వల్ల ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. అజాగ్రత్తగా ఓవర్టేకింగ్ చేయడం ప్రాణాంతకమని, సరైన సంకేతాలు ఇవ్వకుండా దిశలు మార్చవద్దని హెచ్చరించారు. అతివేగం కన్నా గమ్యం చేరడం ముఖ్యమని, ’అరైవ్ అలైవ్’ నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏసీపీ వెంట ట్రాఫిక్ ఎస్‌ఐ విజయభాస్కర్, సిబ్బంది ఉన్నారు.