జాతి మహాత్ముడు కృష్ణస్వామి
మన కులాలు
కోర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మహామనిషి. అంతేకాదు ఓ సంస్థ, ఓ వ్యవస్థ. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. సంఘసేవా నిరతుడు. బహు భాషా కోవిదులు. పరిపాలనా దక్షుడు. రాజసానికి, దానగుణానికి ప్రతీక. ముదిరాజ్ జాతి ఆత్మగౌరవం చాటి చెప్పిన మహనీయుడు. ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడు. ముదిరాజ్ జాతి పితామహుడు, మహాత్ముడు. శ్రీ కృష్ణస్వామి జీవితం ముదిరాజ్‌లకేగాక మానవలోకానికే ఆదర్శం. ఆయన జీవితం ఆటుపోటుల మయం. చీకటి వెలుగుల సమ్మిళితం. ముదిరాజ్ జాతి అభ్యున్నతికి కృష్ణస్వామి చేసిన సేవలు చిరస్మరణీయం. ముదిరాజ్ జాతిరత్నం శ్రీ కోర్వి కృష్ణస్వామి 1893 సెప్టెంబర్ 3న కృష్ణస్వామి పర్వదినాన స్వర్గీయ ఎల్ల య్య, శ్రీమతి బిజా బాయి పుణ్యదంపతులకు జన్మించారు. ఆనాటి నిజాం రాష్ట్రంలో భాగమైన ఔరం గాబాద్ జిల్లా ‘జాల్నా’ అనే పట్టణం ఆయన జన్మి స్థానం.
తల్లిదండ్రులు కృష్ణస్వామిని ’కృష్ణా’ అని ముద్దుగా పిలిచేవారు. ఆ చిన్ని కృష్ణుడే కృష్ణస్వామి ముదిరాజ్ రాష్ట్రంలోనేగాక దేశంలోనే ప్రసిద్ధి చెంది, ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని, కీర్తిప్రతిష్ఠలను జగద్విదితం చేశారు. కృష్ణస్వామి కుటుంబీకులు నిజాం సైన్యంలో పని చేస్తూ ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించేవారు. తండ్రి ఎల్లయ్య బర్మా, పంజాబ్ యుద్ధాలలో పాల్గొని విశ్వసనీయమైన సైనికులుగా పేరు పొందారు. అందుకే, కృష్ణస్వామి కూడా చిన్నతనం నుండి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ వచ్చారు. కీర్తిశేషులు ఎల్లయ్య బిజూబాయి దంపతులకు అయిదుగురు సంతానం. మొదటి సంతానం సాయమ్మ, తర్వాత ఇద్దరు సంతానం మరణించారు. మూడవ సంతానంగా మన కృష్ణస్వామి ముదిరాజ్ జన్మించారు. అయిదవ సంతానంగా నారాయణ స్వామి జన్మించారు. అక్క సాయ మ్మను కృష్ణస్వామి మాతృప్రేమతో గౌరవించి చివరి వరకు సేవలందించారు.
కృష్ణస్వామి ప్రాథమిక విద్య
కృష్ణస్వామి బాల్యం జాల్నా పట్టణంలో గడవగా స్వయంకృషితో హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషలను అభ్యసించారు. కృష్ణస్వామి 17 ఏళ్ల ప్రాయంలోనే పర్భణి పట్టణంలో తాత్కాలిక హెడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తండ్రికి పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేనందున ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాదుకు చేరుకున్నారు. మరో ఉద్యోగం దొరకక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పూజ్యులు రాయ్ భవానీ ప్రసాద్, హకీం మక్సూద్ అలీఖాన్‌లు కృష్ణస్వామిని ప్రేమతో ఆదుకున్నారు. అదే కాలంలో చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో ఆయన చేరి మెట్రిక్యులేషన్ ఉతీర్ణులయ్యారు. ఇంటర్ మీడియట్ తర్వాత టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ కోర్సులు చేశారు. కృష్ణస్వామి యోగ్యతను గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ తన ఆంతరంగిక కార్యదర్శిగా నియమించుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత ప్రభుత్వ సంస్థ నిజామ్స్ బ్రిగేడ్ ఆఫీసులో ఉద్యోగిగా చేరి 9 సంవత్సరాలు సేవలందించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రింటింగ్, పబ్లిషింగ్ కోర్సులో శిక్షణ పొందేందుకు బొంబాయికి వెళ్ళి, శిక్షణ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు వచ్చారు.
వివాహం - ముద్రణా రంగంలో ప్రవేశం
కృష్ణస్వామి ప్రథమ భార్య ఒక కూతురుకు జన్మనిచ్చారు. అయితే, తల్లీ కూతుళ్లు ఇద్దరూ విధివశాన మరణించారు. కొద్దికాలం తర్వాత హైదరాబాద్, పంజగుట్ట వాస్తవ్యులైన ఈశ్వరమ్మని కృష్ణస్వామి ద్వితీయ వివాహం చేసుకున్నారు. కృష్ణస్వామి దంపతులకు నలుగురు సంతానం కలిగారు. మొదటి కుమార్తె చంద్రకాంత, కుమారుడు సూర్యప్రకాశ్, రెండవ కుమార్తె పుష్పాబాయి, మూడవ కుమార్తె పద్మాబాయి. మొదటి కుమార్తె చంద్రకాంత స్వర్గస్థులైనారు. చంద్రకాంత జన్మించిన తర్వాత కృష్ణస్వామి ఐశ్వర్యాభివృద్ధి జరిగింది. కుమార్తెను కృష్ణస్వామి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు. ముద్రణా రంగంలో శిక్షణ పూర్తి చేసుకున్న కృష్ణస్వామి గౌలిగూడ ప్రాంతంలో కుమార్తె పేరున ‘చంద్రకాంత ప్రెస్’ ప్రారంభించారు. భవాని రాంచందర్ సహకారంతో ముద్రణాలయాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైందిగా తీర్చిదిద్దారు. కృష్ణస్వామి సోదరుడు నారాయణ స్వామి, మేనమామ పుత్రులు శంకరస్వామి, ముత్యాల స్వామి, రాజరత్నం మొదలైన కుటుంబసభ్యులు చంద్రకాంత ప్రెస్‌లో పనిచేస్తూ ప్రెస్ అభివృద్ధికి కృషిచేశారు.
ప్రప్రథమంగా పిక్టోరియల్ హైదరాబాద్ అనే మహాగ్రంథాన్ని రెండు సంపుటాలుగా ప్రచురించారు. దక్కన్ స్టార్, ఆర్య సమాజానికి చెందిన ‘మసావాత్’ పత్రికలు ముద్రించారు. స్వీయ సంపాదకత్వంలో ‘ది న్యూఎరా’ పత్రికను స్థాపించి చంద్రకాంత పేరును సుప్రసిద్ధం చేశారు. కృష్ణస్వామి ముదిరాజ్ విద్యావంతులు. మంచి రచయిత, వ్యాసకర్త, చరిత్రకారుడు. చారిత్రక అంశాలతో జన బాహుళ్యానికి ఎన్నో రచనలు అందించారు. ఆయన రచించిన గ్రంథాలు: 1. హైదరాబాద్ నగర నిర్మాణ చరిత్ర 2. హైదరాబాద్ మున్సిపల్ పరిపాలన వ్యవస్థ చరిత్ర 3. హైదరాబాద్ రాజ వంశీయులు నవాబులు జాగీర్దారుల చరిత్ర (పిక్టోరియల్ హైదరాబాద్) 4. హైదరాబాద్ రాష్ట్ర 30 సంవత్సరాల పోరాటం 5. ముదిరాజ్ జాతి చరిత్ర 6. గోవా రాష్ట్ర స్వాతంత్య్ర ఉద్యమం 7. బయోగ్రఫీ ఆఫ్ నవాబ్ దీన్‌యార్ జంగ్ బహదూర్.
కాంగ్రెస్ నగర మేయర్‌గా కృష్ణస్వామి
కృష్ణస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరి మొదటిసారిగా 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. 1922లో ఉద్యమ విజయంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా పని చేశారు. కాంగ్రెస్ రాజకీయ సమ్మేళనాన్ని చెరారులో ఘనంగా నిర్వహించారు. గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ ఖాదీ ఉద్యమాన్ని విస్తృతం చేశారు. చివరి వరకు ఖాదీ వస్త్రాలనే ధరించారు. 1928లో ఆంధ్రా కాన్ఫ్‌రెన్సు స్థాపించారు. స్టాండింగ్ కమిటీ సభ్యునిగా, వర్కింగ్ కమిటీ మెంబర్‌గా అమూల్యమైన సేవలు అందించారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో స్టేట్ అండ్ రిఫార్మ్స్ అసోసియేషన్ స్థాపించి లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థాపన కోసం కృషి చేశా రు. సూర్యాపేటలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు కారకులయ్యారు.
స్టేట్ కాంగ్రెస్‌ను నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ 8న నిషేధించింది. వ్యతిరేకంగా సుల్తాన్ బజార్‌రోడ్‌పై సత్యాగ్రహం చేశారు. వీరి పోరాట ఫలితంగా జవహర్‌లాల్ నెహ్రూ చొరవతో 1946లో స్టేట్ కాంగ్రెస్‌పై నిషేధం తొలగించారు. 1948 సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ జరిగింది. భారత సైన్యాలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకోవడంలో కృష్ణస్వామి తన వంతు కృషి చేసి చరితార్థులయ్యారు. చివరి వరకు కృష్ణస్వా మి తాను కాంగ్రెస్ వాదినని సగర్వంగా చెప్పుకున్నారు. కృష్ణస్వామి 1933లో మొదటిసారిగా చుడీబజార్ నియోజక వర్గం నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1940లో ప్రభుత్వం తరపున ‘నాయంబు మీర్ మజ్లిస్’గా నియామకమయ్యారు. 1955లో ఉపనగర పాలకులుగా ఎన్నికయ్యారు. 1951లో చివరి సారిగా కౌన్సిలర్‌గా ఎన్నికై హైదరాబాద్ నగర మేయర్‌గా సాంప్రదాయ రీతిలో పదవీ బాధ్యతలు స్వీకరిం చారు. చేతి రిక్షాలను రద్దు చేసి మానవత్వం మూర్తీభవించిన మనిషినని నిరూపించుకున్నారు. స్వయంగా నడిచి వెళ్ళేవాడే కానీ, మనిషి లాగే రిక్షాలో కూర్చునేవాడు కాదు. ఉపాధి కోల్పోయిన చేతి రిక్షా కార్మికులకు స్వయంఉపాధి కల్పించారు.
(కృష్ణస్వామి తదనంతర జీవిత విశేషాలు వచ్చేవారం)
- పల్లెబోయిన అశోక్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి






