‘కామన్ స్కూల్’ విధానం కలేనా?
‘ఓట్ల పండగ వచ్చిందంటే చాలు, మేధావి వర్గం ప్రజలకు ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తే చాలు’ అనే చర్చ చేస్తది. పాపం వారి మాటలు రాజకీయ పార్టీలకు రుచించవనుకోండి. రాజకీయ పార్టీలు మాత్రం విద్య, వైద్యం తప్ప ‘అన్నీ ఫ్రీగా ఇస్తాం’ అన్నట్లుగా మాట్లాడతాయి. జాతీ య విద్యా విధానం ప్రతిపాదించి, పార్లమెంట్‌లో ఆమోదించి 60 ఏండ్లు గడిచి నా, అనేకమంది పాలకులు మారినా దేశం లో నేటికీ ‘కామన్ స్కూల్’ (కామన్ స్కూ ల్ ఎడ్యుకేషన్) అమలు నోచుకోని హామీగా, కలగానే మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన మొద టి ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం ‘కేజీ టు పీజీ’ అమలుకు నోచుకోలేదు. కేవలం గురుకులాలను ప్రోత్సహిస్తూ మిగతా బడులను నిర్లక్ష్యం చేసింది. ‘కలెక్టర్ పిల్లవాడైనా, కడుపేద పిల్లవాడైనా ఒకే బడిలో చదివేలా విద్యా విధానాన్ని రూపొందించి అమలు చేస్తామని’ నాడు మన నాయకు లు హామీ ఇచ్చారు. విద్యారంగంలో ఉన్న వివిధ యాజమాన్యాలను ఒకే యాజమాన్యం కిందికి తీసుకు వచ్చి ‘కామన్ స్కూల్’ వ్యవస్థగా ఏర్పాటు చేస్తామని (కేజీ టు పీజీ) చెప్పారు. ఒకే యాజమాన్యం, ఓకే సిలబస్. అమీర్ నుండి గరీబ్ వరకూ అందరూ చదివే కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ అది. ఇది ఇలా వుండగానే, మరోవైపు నేటి ప్రభుత్వం మండ లానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని, వాటిలో మంచి వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యను ఉచితంగా అందిస్తామని అంటున్నది.
అరవై ఏళ్ల కిందటి ప్రతిపాదన
విద్యారంగంలో ‘కామన్ స్కూల్’ ఆశయాన్ని మొట్టమొదటిసారిగా 1964- లో ప్రస్తావించింది కొఠారి కమిషన్. దేశంలోని పాఠశాల విద్యారంగాన్ని, ఉన్నత విద్యారంగాన్ని పరిశీలించి తగిన సిఫారసులు చేయడం కోసం నాటి యుజిసి చైర్మన్ డీఎస్ కొఠారి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. కొఠారి కమిషన్ ఏర్పడే నాటికి దేశవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల కింద పలు రకాలుగా పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థలు నడుపుతున్న స్కూళ్లు, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న పాఠశాలలు, కొన్ని గుర్తింపు లేని స్కూల్స్ వాటిలో ఉన్నాయి. ప్రభుత్వ విద్యారంగ విస్తరణ కోసం పాఠశాలల సంఖ్యను పెంచడం కంటే ‘కామన్ స్కూల్’ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆవా స ప్రాంత పాఠశాల విధానం మీద ఆధారపడి ఈ ‘కామన్ స్కూల్ ఎడ్యుకేషన్’ ఉండాలని కొఠారి కమిషన్ చెప్పింది. 1968లో మొదటి జాతీయ విద్యావిధానంలో, 1986లో రెండవ విధానంలో, 1992లో సవరించిన సంస్కరణలో ఈ ‘కామన్ స్కూల్ ఎడ్యుకేషన్’ పొందుపరచడం జరిగింది. 1986, 1992 విధాన ప్రకటనలను పార్లమెంటు కూడా ఆమోదించింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన,అభివృద్ధి చెందుతున్న పలు దేశాలలో ఏదో ఒక రూపంలో ‘కామన్ స్కూల్ విధానం’ అమలులో ఉంది.
అసమానతలకు అతీతంగా..
సమాజంలో ధనవంతులకు, పేదవారికి మధ్య, చదువుకున్న వారికి చదువు రాని వారికి నడుమ, వివిధ మతాలు, కులాల వారి మధ్య ఉన్న దూరం విద్యా రంగాన్ని ప్రభావితం చేసిందని ఈ విభేదాలు, అంతరాల్లో చిక్కుకొని ప్రజలు విభజితమై ఉన్నారని, సామాజిక విభజన ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాలను సమాజానికి దూరంగా ఉంచిందని ‘కొఠారి కమి షన్’ గ్రహించింది. ప్రత్యామ్నాయంగానే ‘కామన్ స్కూల్ విధానాన్ని’ చూపింది. సామాజిక విభజనకు సంబంధించిన ప్రభావాలు పాఠశాల మీద పడకూడదని, పాఠశాల స్థానిక సమాజంతో సన్నిహితం గా కలిసి పోవాలని, సామాజిక భాగస్వా మ్యం పెరిగి జాతీయ అభివృద్ధికి ముఖ్యం గా సామాజిక సమగ్రతకు, జాతీయ సమగ్రతకు దోహద పడాలని ‘కొఠారి కమిషన్’ భావించింది. ‘కామన్ స్కూల్’ విధానంలో ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక సంస్థల పాఠశాలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ పాఠశాలలకు కూడా కమిషన్ చోటు కల్పించింది. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే పనిచేస్తూ సేవా దృక్పథం కలిగి ఉండాలని భావించింది. ఆవాస ప్రాంత పాఠశాల విధానంలో ఒక పాఠశాలకు దాని ఆవాస ప్రాంతాన్ని గుర్తించి, ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కుల,మత, జాతి, ఆర్థిక స్థితిగతులు, సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
విప్లవాత్మక భావాలు
‘కామన్ స్కూల్’ విధానం విద్యారంగం లో ఒక విప్లవం వంటిదని, సమాజంలో జరగవలసిన సామాజిక ఆర్థిక సాంస్కృతిక విప్లవాలకి అది బాట వేస్తుందని కూడా ‘కొఠారి కమిషన్’ భావించింది. ఈ కామన్ స్కూల్ లక్ష్యసాధన కోసం ప్రభుత్వాలకి కాలవ్యవధిని నిర్ణయించింది. దీర్ఘకాలికంగా సుమారు 20 సంవత్సరాల కాలంలో ‘కామన్ స్కూల్స్’ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, ఈ గడువు 1986 తోనే ముగిసిపోయింది. ఇప్పటికీ పాలకులు పట్టిం చుకున్న దాఖలాలు లేవు. కుల మతాల పేరుతో గురుకులాలను ఏర్పరచి పసిప్రాయంలోనే కులమత బీజాలను బాలలలో నాటుతున్నారు. విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ 1980 దశకంలో ప్రారంభమైంది. 1990 లో విద్యా వ్యాపారం బాగా విస్తరించింది. నేడు విద్యారంగం ప్రైవేటు కార్పొరేటివ్ శక్తుల కదంబ హస్తాల్లో బందీ అయి విలవిల లాడుతున్నది. దేశంలోని ప్రజలకు ‘కామన్ స్కూల్’ కలగానే మిగిలిపోయింది. నూతన జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలనీ: ఎన్‌ఈపీ 2020) ప్రకారం విద్యలో పెట్టిన పెట్టుబడులు మానవ వనరులను సృష్టించడమేకాక ప్రపంచ మార్కెట్‌లనూ అభివృద్ధి పరుస్తాయి. నైపుణ్యవంతమైన ప్రపంచస్థాయి విద్యార్థులను తయారు చేసే విధంగా విధానాన్ని రూపొందించారు. ఇంత జరిగినా, ‘కామన్ స్కూల్’ వ్యవస్థ ఏర్పాటు దిశగా చర్యలు మాత్రం లేవు.
తరగతి గదిలో భారత్ భవిష్యత్తు
భారతదేశపు భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతుందన్న ‘కొఠారి కమిషన్’ ఆశ అడియాశ వలెనే ఉన్నది. ఆ తరగతి గది కులమతాలకు, సామాజిక ఆసమానతలకు అతీతంగా రూపొంది జాతీయ సమగ్రతకు తోడ్పడుతుందని, లౌకిక తత్వాన్ని కలిగి ఉంటుందని కొఠారి కమిషన్ ఆశించింది. కమిషన్ ఏర్పడి 60 ఏళ్లు గడిచినా ఆ విధానకర్తల ఆశయ సాధనకు నాటి నుండి నేటి వరకు చిత్తశుద్ధితో కృషి చేసిన పాలకులు లేరు. స్వతంత్ర భారతం లో విద్యా కమిషన్లు ఏర్పాటు చేయడం, కమిషన్ల ప్రతిపాదనలను పక్కన పెట్టడం జరుగుతూనే ఉంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ‘కామన్ స్కూల్’ ఆశయాన్ని అమలు చేసే దిశగా, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యసాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు కేజీ టూ పీజీ, నేడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ పాలకులు మాట్లాడుతున్నారు. ఏండ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, ప్రీ ప్రైమరీలను ప్రారంభించి, ఉన్నత పాఠశాలలను మినీ గురుకులాలుగా మార్చి, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకొని, కుల, మత, సామాజిక ఆర్థిక అసమానతలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటే ‘కామన్ స్కూల్’ కల కొంతవరకైనా నిజమ య్యే అవకాశం ఉంటుంది.
పాకాల శంకర్ గౌడ్,
వ్యాసకర్త సెల్: 9848377734






