7 May, 2026 | 12:10 PM

మధ్యప్రాచ్యంపై ముందడుగు

23-05-2024 12:18 AM

రావణకాష్టంలా రగులుతున్న మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని బలంగా వాదిస్తున్న ఐరోపా దేశాల్లో కొన్ని దేశాలు కీలక ముందడుగు వేశాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. నార్వే ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించగా, తాజాగా ఐర్లాండ్, స్పెయిన్ కూడా ప్రత్యేక పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు నార్వే ప్రధాని జోనాస్ గర్‌స్టోర్ ప్రకటించారు. ఇలా గుర్తించకుంటే మధ్యప్రాచ్యంలో  శాంతి ఉండదన్న ఆయన ఈనెల 28 నుంచి దాన్ని అమలు చేస్తామన్నారు. మరోవైపు స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ 28 నుంచి పాలస్తీనాను ప్రత్యేక రాజ్యంగా పరిగణిస్తామన్నారు.  ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ మాట్లాడుతూ, స్పెయిన్, నార్వేలతో సమన్వయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇది ఐర్లాండ్‌తోపాటు పాలస్తీనాకు కూడా చారిత్రక దినమని, అక్కడ శాంతికి ఇదే పరిష్కార మార్గమన్నారు. అయితే, ఈ యూరప్ దేశాల నిర్ణయంపై ఇజ్రాయెల్ మండిపడింది. ఆయా దేశాలనుంచి తమ రాయబా రులను ఉపసంహరించు కుంటున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ ప్రకటించారు.

‘పాలస్తీనాసహా యావత్ ప్రపంచానికి ఐర్లాండ్, నార్వేలు ఉగ్రవాదం విజయం సాధిస్తుందనే సందేశాన్ని పంపాలని అనుకుంటున్నాయా?’ అని ప్రశ్నించారు.హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, కాల్పుల విరమణ ఒప్పందాల ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి ఇజ్రాయెల్‌తోపాటు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. 1988 నుంచి ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాల్లో దాదాపు 140 దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి.ఇన్ని దేశాలు గుర్తించినప్పటికీ, బ్రిటన్, అమెరికా లాంటి అగ్రదేశాలు సాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించకపోవడంతో అక్కడ శాంతి నెలకొనడం లేదనేది సుస్పష్టం. ఈ దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ ఉండడమే ఇందుకు కారణం. అంతేకాదు, మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పే ప్రయత్నాల్లో తనదే పెద్దన్న పాత్రగా ఉండాలన్న అమెరికా ఆలోచనకూడా అక్కడ శాంతికి గండి కొడుతూ ఉంది. ఓస్లో శాంతి చర్చలు, ఒప్పందం నుంచి కూడా ఈ ప్రక్రియపై అమెరికాదే గుత్తాధిపత్యం కొనసాగుతోంది.త్వరలో ఐరోపా యూనియన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో శాంతి విషయంలో  చొరవ తీసుకోవాలని పలు ఐరోపా దేశాలు నిర్ణయించాయి.

అందులో భాగమే తాజా పరిణామాలు. అయితే, పాలస్తీనాను ఐరోపా దేశాలు గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2014లోనే స్విట్జర్లాండ్ పాలస్తీనాను గుర్తించింది. ఆ సమయంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ‘పాలస్తీనా స్వయం నిర్ణయాధికారాన్ని ధ్రువీకరించే ముఖ్యమైన అడుగు ఇది. మిగతా దేశాలు ఇదే బాటలో నడుస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు. అయితే, ఇప్పుడు మూడు ఐరోపా దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించినంత మాత్రాన తక్షణం మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ, ఆ దిశగా ముందుకు వెళ్లడానికి ఇది ఊపునిస్తుందనడంలో సందేహం లేదు. ఇజ్రాయెల్ విషయంలో తాను అనుసరిస్తున్న వైఖరి సరైంది కాదని అమెరికా గ్రహిం చడానికీ తోడ్పడుతుంది. పదిమంది నడిచే దారిలో తానూ నడవాల్సిన అవసరాన్ని అగ్రరాజ్యం గుర్తించేలా చేస్తుంది. ఈ ఏడాది చివర్లో అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో ఆ పదవికి పోటీ పడుతున్న నేతలు మధ్యప్రాచ్యం విషయంలో తమ వైఖరిని సమీక్షించుకోవలసి ఉంది. భారత్‌లాంటి దేశాలుకూడా నైతిక మద్దతు మాత్రమే ప్రకటిస్తే సరిపోదని, దేశంగా గుర్తించాల్సిన అవసరం ఉందనే సంగతిని గ్రహించాలి. అన్నిటికన్నా మించి పాలస్తీనాతో సహజీవనం తప్పదనే వాస్తవాన్ని ఇజ్రాయెల్ గ్రహించినప్పుడే మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతి సాధ్యం.