రాణించిన అరుంధతిరెడ్డి, షెఫాలీ
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ మహిళల విజయం
చెమ్స్‌ఫోర్డ్, మే 26 : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత మహిళల జట్టు ఫామ్ అందుకుంది. ఈసీబీ డెవలప్‌మెంట్ వుమెన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టింది. అన్ని విభాగాల్లోనూ రాణించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఈసీబీ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఫ్లోరెన్స్ మిల్లర్ (48), గార్డనర్(36), సోఫియా (27) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాద్‌కు చెందిన అరుంధతి రెడ్డి ఆకట్టుకుంది. 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.
తర్వాత ఛేజింగ్‌లో భారత్ అదరగొట్టింది. 17వ ఓవర్లోనే భారత్ 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగా ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. దీంతో 20 ఓవర్ల వరకూ బ్యాటింగ్ చేసిన భారత్ 200 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 25 బంతుల్లో 50 (9 ఫోర్లు, 1 సిక్స్), భారతి పుల్మలి 29 బంతుల్లో 48 (5 ఫోర్లు, 2 సిక్సర్లు), యస్తిక భాటియా 35 బంతుల్లో 47 (6 ఫోర్లు) పరుగులతో రాణించారు.
భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ గురువారం నుంచి ఆరంభం కానుంది. చెమ్స్‌ఫోర్డ్‌లో తొలి టీ20, బ్రిస్టల్‌లో రెండో టీ20, టాంటన్‌లో చివరి టీ20 జరగనున్నాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగానే జడరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆడనుంది.






