అమ్మవార్ల పేరిట అయ్యగార్ల పంచాయితీ!
హనుమకొండ, మే 29(విజయక్రాంతి): వరంగల్ ధార్మిక భవన్‌పై భద్రకాళి దేవస్థానం కన్నుపడింది. వేదపాఠశాల పేరిట ఆ భవన్‌ను ఎట్లాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన ప్రధాన పూజారి రాజకీయం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్నారు మేడారం పూజారులు. కొంతకాలంగా ఇరువర్గీయుల మధ్య నడుస్తున్న లొల్లి ఇటీవల రచ్చకెక్కింది. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు సైతం భద్రకాళి ఆస్థానానికే మద్దతు తెలుపుతున్నారంటూ మేడారం పూజారులు మండిపడుతున్నారు. వారి వైఖరిని నిరసిస్తూ మేడారం పూజారులు రెండు రోజుల పాటు (29, 30 తేదీల్లో) సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని మూసి వేసి ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం అమ్మవార్ల స్థలం అయ్యగార్ల పంచాయతీగా మారింది.
అసలేం జరిగింది..?
1993లో మేడారం జాతర భవిష్యత్ అవసరాల కోసం అప్పటి ప్రభుత్వం వరంగల్ కేంద్రకారాగారం ( ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ) ఎదుట 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. ఏడాది కిందట ఈ స్థలంలో మేడారం, భద్రకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరి స్వామి దేవస్థానాల ఆదాయం నుంచి రూ. 3.30 కోట్ల తో ధార్మిక భవన్‌ను నిర్మించారు. నాలుగు అంతస్తులు గల భవనంలో దేవాదాయశాఖకు సంబంధించిన వరంగల్ జోనల్ ఆఫీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్, మేడారం ఈఓ ఆఫీస్, ఇంజినీరింగ్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ భవనాన్ని భద్రకాళి దేవస్థానం ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు అక్కడి రిటైర్డ్ ప్రధాన పూజారి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మేడారం పూజారులు ఆరోపిస్తున్నారు. ఆ భవనం, స్థలం మేడారం సమ్మక్క వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, ఆ భవనం మాకే అప్పగించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలిచ్చినా స్పందన లేదని వాపోతున్నారు. ఈ మేరకు ఆందోళనకు దిగడం ఒక్కటే మిగిలి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో భవనాన్ని వదులుకునేది లేదని మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, రఘుపతిరావు స్పష్టం చేస్తున్నారు.
18 జిల్లాలకు పెద్దదిక్కుగా ధార్మిక భవన్..!
వరంగల్ ధార్మిక భవన్ 18 జిల్లాలకు పెద్దదిక్కుగా ఉంది. తెలంగాణలో దేవాదాయశాఖకు సంబంధించి రెండు మల్టీజోన్‌లు ఉండగా హైదరాబాద్ తర్వాత రెండోది వరంగల్లో ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన దేవాదాయశాఖ ఉద్యోగులు, అర్చకుల జీత భత్యాలు, వ్యయాలు, దూపదీప నైవేద్యాలు, ఆలయాల నిర్మాణాలతో పాటు మేడారం జాతరకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతుంటాయి.
1993లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్ జిల్లా కేంద్రంలోనే సెంట్రల్ జైల్ ఎదుట వెయ్యి గజాల స్థలం కేటాయించింది. కానీ 30 ఏళ్ల తర్వాత ధార్మిక భవనం నిర్మాణానికి అడుగులు పడి పూర్తయింది. భద్రకాళి దేవస్థానం కొంత నగదును అందజేయడంతో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వేదపాఠశాలకు ఒక అంతస్తును కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సాకుతో మొత్తం భవనాన్ని దక్కించుకునేందుకు దేవస్థానం వారు రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
భవన్ వేదపాఠశాలకు అనుకూలమేనా...?
వేదపాఠశాల పేరిట ధార్మిక భవన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్న భద్రకాళి దేవస్థానం తీరును మేడారం పూజారులతో పాటు అర్చక సమాజం ఎండగడుతోంది. కేవలం 18 మందితో నడుస్తున్న వేదపాఠశాల నిర్వహణ కోసం 18 జిల్లాలకు చెందిన అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది జీవితాలతో చెలగాటమాడుతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వేదపాఠశాల నిర్వహించాలనే సదుద్ధేశమే వారికుంటే భద్రకాళి దేవస్థానం ఆవరణలో కావాల్సినంత స్థలం ఉన్నట్లుగా చెబుతున్నారు. దేవస్థానం పక్కనే నిరుపయోగంగా ఉన్న రెండు అంతస్తులు దేవాదాయశాఖ పాత కార్యాలయం ఉంది.
అంతేగాకుండా ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఎకరం ఖాళీ స్థలం, బండి పూజలు నిర్వహించే స్థలం కూడా వేదపాఠశాలకు వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. వేదపాఠశాల నిర్వహించే స్థలం ప్రశాంతత కూడుకుని ఉండాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. అలా కాకుండా ధార్మిక భవన్ ఉన్న చోటు వరంగల్ ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉండటంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. భవన్ పక్కనే మసీదు, వావానాల వర్క్‌షాపులు, ఇతర వాణిజ్య వ్యాపారాలు నడుస్తుంటాయి.
ఇలాంటి చోట వేఠపాఠశాల నిర్వహించడం కష్టసాధ్యమని మేడారం పూజారులు అభిప్రాయపడుతున్నారు. కేవలం భద్రకాళి దేవస్థానం ప్రధాన పూజారి (రిటైర్డ్) వ్యక్తిగత స్వార్థం మేరకే ఈ రాజకీయం నడుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మేడారం పూజారులతో ప్రారంభమైన పోరాటం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుంతో వేచి చూడాల్సిందే?
ఆ స్థలం దేవాదాయశాఖకు కేటాయించారు
ప్రస్తుతం ధార్మిక భవన్ నిర్మించిన స్థలాన్ని 1993లో అప్పటి ప్రభుత్వం దేవాదాయశాఖకు కేటాయించింది. అంతే తప్పా ప్రత్యేకంగా భద్రకాళికి గానీ, మేడారం ఆలయానికి గానీ కేటాయించలేదు. అప్పటి రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టత వస్తుంది. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మేడారం పూజారులు, ఆదివాసీలను రెచ్చగొట్టి ఆ స్థలం, భవనం సమ్మక్క సారలమ్మ ఆలయానిదేనని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఆ భవనం దేవాదాయశాఖకు చెందినది. భద్రకాళి సమీపంలో నడుస్తున్న వేద పాఠశాల మాడవీధుల నిర్మాణంలో పోతున్నందున ధార్మిక భవన్‌లో కొనసాగిస్తున్నాం.






