గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించారు. పోలీస్ స్టేషన్లో విధినిర్వహణలో ఉండగానే ఆయనకు గుండెపోటు రాగా వెంటనే అతనికి పోలీసులు సిపిఆర్ చేసి మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించినట్లు ఎస్సై మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) తెలిపారు. ఏఎస్ఐ కృష్ణమూర్తి గతంలో కానిస్టేబుల్ గా కేసముద్రంలోనే విధులు నిర్వహించగా, ఏఎస్ఐ గా పదోన్నతి పొంది 2021లో కేసముద్రం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు.
తమతో విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ఏ.ఎస్.ఐ కృష్ణమూర్తి మరణించడంతో కేసముద్రం పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక్కడే కానిస్టేబుల్ గా విధులు నిర్వహించి, ఏఎస్ఐ గా పదోన్నతి పొంది, కొద్దికాలంలో పదవీ విరమణ పొందాల్సిన సమయంలో కృష్ణమూర్తి హఠాన్మరణం వార్త కేసముద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్ఐ కృష్ణమూర్తి విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవలకు గాను ఇటీవలే పోలీసు శాఖ నుంచి ఉత్కిష్ట మెడల్ అందుకున్నారు.






