యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం
మహబూబాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ శిబిరం ప్రారంభం
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నియామకాలకు సిద్ధమవుతున్న మహబూబాబాద్ జిల్లా యువతీ యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ కోచింగ్ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, చైర్‌పర్సన్ జ్యోతి, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఆదర్శంగా తీసుకొని యువత కష్టపడి ఉద్యోగాలు ధించాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని యువతకు పోలీస్ ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంతో చక్కటి ఉచిత కోచింగ్ అందిస్తున్నారన్నారు. భద్రాద్రి జోన్ పరిధిలో కేటాయించిన పోలీస్ ఉద్యోగాల ఖాళీలను ప్రస్తావిస్తూ, మహబూబాబాద్ జిల్లాకు కేటాయించిన పోస్టులను లక్ష్యంగా చేసుకుని అభ్యర్థులు కష్టపడి సిద్ధం కావాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ శిబిరం ఎంతో మంచి అవకాశమన్నారు. పోలీస్ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించేందుకు ముందుగా 1,056 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్‌కు ఎంపిక చేసి, అందులో 500 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేసినట్లు ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.






