తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత
కుటుంబ సభ్యులకు ధైర్యం
వారి పిల్లలకు అండగా ఉంటామని ఎంపీ రవిచంద్ర భరోసా
(ఖమ్మం, విజయక్రాంతి): ఇటీవల మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తాజుద్దీన్ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన చురుకైన నాయకుడు అని, ఖమ్మం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని రవిచంద్ర గుర్తు చేసుకున్నారు.
ఆయన మృతి పార్టీకి, మైనార్టీ సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. తాజుద్దీన్ కుటుంబ పరిస్థితిని మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, పార్టీ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందేలా తన వంతు కృషి చేస్తానని రవిచంద్ర భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచిస్తూ, వారు ఏమాత్రం మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ కార్పొరేటర్ మక్బుల్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి , సద్దాం, ఫిరోజ్, మహమ్మద్ రఫీ, షారుక్ అర్ఫత్, మునఫ్, బురహాన్, ఆసిఫ్, హిజార్ తదితరులు పాల్గొన్నారు.






