21 May, 2026 | 2:42 AM

వనదుర్గమ్మ చెంత.. భక్తుల అవస్థలు..

21-05-2026 01:12 AM
  1. పుణ్య స్నానమనంతరం 
  2. మహిళలు దుస్తులు మార్చుకునేదెలా?
  3. నిరూపయోగంగా శౌచాలయాలు 
  4. జల్లు స్నానాలు లేక మురికి నీటిలోనే భక్తుల పుణ్యస్నానాలు
  5. రూ. కోట్లల్లో ఆదాయం ఉన్నా వసతులు సున్నా

పాపన్నపేట, మే20: దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం. రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం. జంటనగర వాసులు, పొరుగు రాష్ట్రాల వారిని ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రం. ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడే ప్రాంగణం. ఏటా రూ. కోట్లలో సమకూరే ఆదాయం. అలాగైతే అక్కడ అన్ని వసతులు బాగుంటాయని, సందర్శకులకు ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటే మాత్రం పొరపడినట్లే.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది ఏడుపాయల పరిస్థితి. పాలకవర్గం లేకపోవడంతో కూడా వసతులను పట్టించుకునే వారు కరవయ్యారని చెప్పవచ్చు. ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, ప్రధానంగా జంట నగరాల నుంచి, పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిభక్తులు ఏడుపాయల వన దుర్గామాత దర్శనానికి తరలి వస్తారు.

వచ్చిన భక్తులు మంజీరా నదీపాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. నది పాయల్లో ఉన్న నీరు ఎక్కువ రోజులు కావడంతో కలుషితమయ్యాయి. దీంతో చేసేదేమీ లేక భక్తులు ఆ మురుగునీటిలోనే స్నానాలు ఆచరిస్తున్నారు. జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తే కొంతమేర ఉపశమనం ఉన్నా అధికారులు ఆ ఆలోచన కూడా చేయడం లేదని భక్తులు మండిపడుతున్నారు. అంతేగాక ఆ నీటిలోనే పాత దుస్తులు, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా మారింది. ముఖ్యంగా పుణ్య స్థానమాచరించిన అనంతరం మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు లేకపోవడంతో వారు అసౌకర్యానికి గురవుతున్నారు.

 కాలకృత్యాలకు ఇబ్బందులు పడుతున్న భక్తులు..

శౌచాలయాలు నిర్మించి వినియోగంలోకి తీసుకు రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాఘ అమావాస్య, మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించే జాతర ఉత్సవాలకు తాత్కాలికంగా మరుగుదొడ్లు నిర్మించి చేతులు దులుపుకుంటారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏడుపాయల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం

 సమస్యలను గుర్తించి, పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తాం. మహిళలు దుస్తులు మార్చుకునే రేకుల గదులను స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేస్తాం. జల్లు స్నానాలు, మరుగుదొడ్లను సైతం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతాం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

- వీరేశం, ఆలయ ఈఓ