20-12-2025 01:06:55 AM
రూ. 50 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల హామీ
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ
ఎల్బీనగర్, డిసెంబర్ 19 : అమెరికాలోని డల్లాస్ నగరంలో అక్టోబర్ 4వ తేదీన ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీకి చెందిన పోలే చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుడు మృతుడు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో మృతుడి కుటుంబానికి అండగా ఉండాలని అమెరికాలో ఉంటున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) సభ్యులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు.
ఈ నేపథ్యంలో గోఫండ్ కార్యక్రమంలో భాగంగా దాదాపు యాబై లక్షల రూపాయలు సేకరించారని ఆటా అధ్యక్షుడు జయంత్ చెల్లా, కాబోయే ఆట అధ్యక్షుడు సతీశ్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం సుధీర్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆట సభ్యులు బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. త్వరలోనే ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మృతుడి తల్లి సునీత, కుటుంబ సభ్యులు గుంటి రాజు, దామోదర్, రాజ్ కిరణ్, శివ ముదిరాజ్, ఆట సభ్యులు పాల్గొన్నారు.