24 February, 2026 | 4:35 PM

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్

24-02-2026 01:06 PM

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు

జిల్లా ఎస్పీ నితిక పంత్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా పరిధిలో మొత్తం 19 పరీక్ష కేంద్రాల్లో 25-02-2026 నుండి 18-03-2026 వరకు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

విధించిన నిబంధనలు ఇవే:

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగడం నిషేధం. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజూ ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.

పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, విద్యార్థులు పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా మరియు భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు, అలాగే పరీక్ష కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా కొనసాగిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.