11 June, 2026 | 2:12 AM

పర్యావరణహితంతో ప్రాయశ్చితం

11-06-2026 12:34 AM

ములుగు (మహబూబాబాద్) జూన్ 10 (విజయక్రాంతి): గంజాయి కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన నలుగురు వ్యక్తుల చేత ములుగు జిల్లా పోలీసులు మొక్కలు నాటిం చి ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా పర్యావరణహితం కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశాల మేరకు ఆదివారం ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

సందర్భంగా గంజాయి కేసుల్లో అరెస్టై కోర్టు ద్వారా శిక్ష పొందిన నలుగురు వ్యక్తులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమేనని, గత తప్పిదాలను పునరావృతం చేయకుండా సమాజానికి ఉపయోగపడే మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా, జీవితంలో సానుకూల మార్పుకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

గంజాయి సమాచారం ఇస్తే.. 5,116 బహుమతి

జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇస్తే 5,116 నగదు బహుమతిని అందిస్తామని ఎస్పీ ప్రకటించారు. ఈ మేరకు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి అవసరమైన ప్రచార పోస్టర్లు స్వయంగా ఎస్పీ ప్రదర్శించి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంజాయి సంబంధిత ‘లీగల్ టీం’ ప్రతినిధులు, అదనపు ఎస్పీ (ఏఆర్) బొంగోని సదానందం, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ములుగు సీఐ దారం సురేష్, ఆర్ ఐ అడ్మిన్ రాధారపు స్వామి, ములుగు ఎస్‌ఐ ఉపేందర్, పీఎస్‌ఐ బుట్ట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.