11 June, 2026 | 2:12 AM

అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

11-06-2026 12:34 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, జూన్ 10 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లాలో యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఏలాంటి అక్రమాలు లేవని ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ గత యాసంగి సీజన్ లో జగిత్యాల జిల్లాలో 80వేల మంది రైతుల వద్ద 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు.ఈ ఏడాది యాసంగి సీజన్లో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5.08లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివ రించారు.

జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకురూ.1,215కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 79,736 మంది రైతుల ఖాతాల్లో రూ. 1,075కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రాత్రి, పగలు తేడా లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో 24గంటల పాటు అందుబాటులో ఉంటు రైతులకు సహకరించిన అధికారులను ఈసందర్భంగా అభినందనలు తెలిపారు. 

వడ్ల కొనుగోలులో ఏలాంటి అక్రమాలు లేవు

జగిత్యాల జిల్లాలో వడ్ల కొనుగోలులో ఏలాంటి అక్రమాలు లేవని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వడ్ల కొనుగోలులో జగిత్యాల జిల్లాలో రూ. 107కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, వారు ఆరోపించినట్లు అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి అన్నారు. ప్రభుత్వంపై బుదర జల్లె కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. 

జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తే అవినీతి జరుగలేదు కాని జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లితేనే వడ్ల కొనుగోలులో అవినీతి జరిగిందా అని మంత్రి ప్రశ్నించారు.ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణపై ప్రతిపక్షలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి అడ్లూరి అన్నారు.

ధర్మపురి మండలంలో స్థానిక అవసరాలకు మాత్రమే గోదావరి నుంచి ఇసుక తీసుకుంటున్నారని ఎక్కడ ఇసుక అక్రమ రవాణ జరుగలేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ నిర్మాణాలను ఇసుక తరలించారని తెలిపారు. ఇసుక రవాణలో ఏలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు.