calender_icon.png 22 February, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత కక్షలతో ఫంక్షన్ లోనే దాడి

21-02-2026 10:01:30 PM

అన్న మృతి, తమ్ముడికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో ఘటన

మంథని రామగిరి,(విజయక్రాంతి): పాత కక్షలతో శనివారం ఏకంగా ఫంక్షన్ హాలు లోనే బావ బామ్మర్దులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోవడంతో అన్న మృతి చెందగా, తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని  సెంటనరీ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో శనివారం బేగంపేట గ్రామానికి చెందిన ఓ పెళ్లిలో అదే గ్రామానికి చెందిన మొలుగురి కొమురయ్య గౌడ్ (58) తమ్ముడు సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మొలుగురి సత్తయ్య గౌడ్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

ఇదే పెళ్లికి బేగంపేట గ్రామానికి చెందిన వీరి బావ బుర్ర రాజాకొమురయ్య గౌడ్ పెళ్లికి హాజరయ్యారు. ఇరువురి మధ్య గత 15 సంవత్సరాలుగా పాత కక్షలు ఉండడంతో పథకం ప్రకారం రాజా కొమురయ్య బావ సత్తయ్య పై దాడి చేసేందుకు గొడవకు దిగాడు. గమనించిన వారు గొడవ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా సత్తయ్యను ఎలాగైనా హతమార్చాలని ముందస్తుగా రాజకుమురయ్య తీసుకొచ్చిన కత్తితో దాడి చేస్తుండగా అక్కడే ఉన్న అన్న కొమురయ్య గౌడ్ తమ్ముడికి అడ్డుపోగా అదే కత్తితో రాజా కొమురయ్య పొడవడంతో కొమురయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

సత్తయ్యను కూడా హతమార్చేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలైన సత్తయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కొమురయ్యను స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో  పోలీస్ స్టేషన్ పక్కనే ఘటన జరగడంతో  ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని అక్కడే ఉన్న సింగరేణి ఆసుపత్రికి కొమురయ్య ను తరలింఛగా అప్పటికే మృతి  చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ్ముడు సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.