మక్కాపై దాడికి యత్నం
- డ్రోన్‌ను కూల్చేసిన సౌదీ
- ‘రెడ్ లైన్’ ప్రకటించిన సౌదీ అరేబియా
- దాడిని ఖండించిన ఓఐసీ, పాకిస్తాన్, టర్కీ
- తాము చేయలేదన్న ఇరాన్ మద్దతు హౌతీలు
- మధ్యప్రాచ్యంలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు
కైరో, సెప్టెంబర్ 16: ఇస్లాం అత్యంత పవిత్ర నగరమైన మక్కా(Mecca)పై డ్రోన్ దాడి(Drone attack)కి ప్రయత్నించారని ఇరాన్(Iran) మద్దతు ఉన్న యెమెన్ హౌతీ(Yemen Houthis) తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా ఆరోపించింది. అయితే ఆ డ్రోన్‌ను తమ సైనిక బలగాలు మధ్యలోనే కూల్చేమని స్పష్టం చేసింది. మక్కాపై దాడి యత్నాన్ని సౌదీ అరేబియా(Saudi Arabia) ‘రెడ్ లైన్’గా ప్రకటించింది. ఈ ఆరోపణలను హౌతీలు ఖండించారు. మక్కాపై దాడిని ఇస్లామిక్ సహకార సంస్థ(Organization of Islamic Cooperation)(ఓఐసీ), పాకిస్తాన్, టర్నీ దేశాలు ఖండించాయి.
అమెరికాకు కీలక మిత్రదేశమైన సౌదీ.. ఇరాన్ యుద్ధంలో రోజురోజుకు కూరుకుపోతోంది. దీంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇస్లాం పవిత్ర నగరం మక్కాపై దాడికి ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ప్రయత్నించారని సౌదీ అరేబియా ఆరోపించింది. యెమెన్ నుంచి మక్కా దిశగా డ్రోన్లు ప్రయోగించారని, అవి పవిత్ర నగర గగనతలంలోకి ప్రవేశించకముందే తమ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని సౌదీ ప్రతినిధుల కూటమి ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్-మాలికీ తెలిపారు.
2017లో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తర్వాత మక్కాపై హౌతీల రెండో దాడి యత్నం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాల దాడి తర్వాత, సౌదీ అరేబియాకు చెందిన ఒక కీలకమైన పైప్‌లైన్‌ను ఇటీవల మూసివేసిన విషయం తెలిసిందే. హౌతీలు సౌదీలోని మౌలిక సదుపాయాలను, ఎర్ర సముద్రంలోని నౌకా రవాణాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అక్కడ వారు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో అనేక ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు., ఇరాన్ ఇప్పటికీ హోర్ముజ్ జలసంధిలో నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది.
యెమెన్ సరిహద్దుకు సుమారు 1,100 కిలోమీటర్ల (680 మైళ్ల) దూరంలో ఉన్న మక్కా వైపు డ్రోన్లను ప్రయోగించడాన్ని హౌతీలు ఖండించారు. అయితే ప్రవక్త ముహ్మద్ జన్మస్థలం మీదుగా ఉన్న గగనతలంలోకి ప్రవేశించ కముందే తాము ఆ డ్రోన్‌ను అడ్డుకుని, ధ్వంసం చేశామని సౌదీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ మధ్య ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందం కూడా చర్చనీయాంశమైంది. అయితే, హౌతీల ఉద్రిక్తతకు ప్రతిస్పందనగా మద్దతు కోసం సౌదీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని టర్కీ, పాకిస్తాన్ అధికారులు తెలిపారు.
మక్కాపై జరిగిన దాడి యత్నాన్ని పాక్ ఖండించింది. టర్కీ విదేశాంగ మంత్రి సంఘీభావం వ్యక్తం చేస్తూ, ఏ దేశమూ ‘ఉదాసీనంగా ఉండజాలదు’ అని పేర్కొన్నారు. సౌదీకి తమ దేశం అచంచలమైన మద్దతు ఇస్తుందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. 57కు పైగా ముస్లిం దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) కూడా విమర్శలు చేసింది. ఈ యత్నం ‘పవిత్ర స్థలాల పవిత్రతను’ ఉల్లంఘిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.
మరోవైపు యెమెన్ మారిబ్ ప్రావిన్స్‌లో సౌదీ కూటమికి చెందిన ఎఫ్15 యుద్ధవిమానాన్ని కూల్చివేశామని హౌతీలు ప్రకటిం చారు. సౌదీ అరేబియాకు అమెరికా భారీస్థాయిలో ఆయుధాలు, రక్షణ సహకారం అందించినప్పటికీ, ప్రస్తుతం యెమెన్ పోరులో ప్రత్య క్షంగా పాల్గొనడం ఆసక్తి చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, యెమెన్‌లో మళ్లీ అంతర్యుద్ధం చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. హౌతీల నుంచి తప్పించుకున్న పౌరుల సంఖ్య లక్ష దాటిందని అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్) వెల్లడించింది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి చైనాలో పర్యటిస్తుండగా, అమెరికా- మధ్య సంయమనం పాటించాలని, హోర్ముజ్ జలసంధిని త్వరగా తెరవాలని చైనా కోరింది.