మియాపూర్ కోటక్ మహీంద్రా ఏటీఎంలో చోరీకి విఫలయత్నం!
ఇద్దరు నిందితుల అరెస్ట్,ఒకరు పరారీ
శేరిలింగంపల్లి,ఆగస్టు 13(విజయక్రాంతి): మియాపూర్ చౌరస్తా సమీపంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం(Kotak Mahindra ATM) కేంద్రంలో ముగ్గురు దుండగులు నగదు దోచుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో సంఘటన జరిగినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ముగ్గురు వ్యక్తులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి ఇనుప రాడ్లు, రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేశారు.
సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉండి నగదు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినా వారి కుట్ర సఫలం కాలేదు. అయితే ఏటీఎంకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీలు అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు.సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించిన మియాపూర్ పోలీసులు సంజీవ్ యాదవ్, రాపాక సూర్య ప్రకాష్‌లను అరెస్టు చేశారు. మరో నిందితుడు కార్తీక్ పరారీలో ఉన్నాడు.
నిందితులు భద్రతా ఏర్పాట్లు సరిగా లేని ఏటీఎంలను ముందుగా ఎంపిక చేసుకుని, ఒకరు బయట కాపలా ఉండగా మరో ఇద్దరు లోపలికి వెళ్లి యంత్రాన్ని పాడుచేసి నగదు దోచుకునే పద్ధతిని అనుసరించేవారని పోలీసులు వెల్లడించారు.చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏసీబీ రవికిరణ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించగా, దర్యాప్తులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎన్. జయరామ్, డిటెక్టివ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి. విజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






