13 August, 2026 | 9:41 AM

వరి సాగుపై ఆచితూచి అడుగు వేయాలి

13-08-2026 08:47 AM

నీటి లభ్యతపై రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి

ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి

ఇన్‌ఫ్లో ఉంటేనే సాగునీరు.. అవసరమైతే ఆన్‌–ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల

వనపర్తి, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల నీటి లభ్యత, రైతులకు సాగునీటి విడుదల అవకాశాలపై ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రస్తుతం ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి నిల్వలు పెరిగాయని నీటిపారుదల శాఖ అధికారులు సమావేశంలో వివరించారు.

ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి ప్రవాహం కొనసాగితేనే రాబోయే రోజుల్లో సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్, కేఎల్‌ఐ, భీమా తదితర ప్రాజెక్టుల నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో నీటి ప్రవాహం తగ్గితే సాగునీటి విడుదలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు వైపు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. మినుము, వేరుశనగ, ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వరి సాగు చేపట్టిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి లభ్యతను బట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్‌ఫ్లో తగ్గిన సందర్భంలో ఆన్‌–ఆఫ్‌ పద్ధతిలో సాగునీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు. జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం, గతంలో ఉన్న నీటి సౌకర్యం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమగ్ర డేటాను సేకరించి త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

 జూరాల నీటిపై ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి... మంత్రి వాకిటి శ్రీహరి 

ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది, ఎంత నీటిని విడుదల చేస్తున్నారు అనే వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు . నీటి లభ్యతపై వాస్తవాలను రైతులకు స్పష్టంగా తెలియజేయాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అందించగల సహాయంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని తెలిపారు.

నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు తీసుకోవాలి... వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

కేఎల్‌ఐ ద్వారా శ్రీశైలం నీటిని వనపర్తి పరిధిలోని రైతులకు అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులకు కొంతమేరైనా నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, కొత్తకోట మండలంలోని శంకరసముద్రం రిజర్వాయర్‌ను కూడా నింపాలని కోరారు.

 వారానికి మూడు రోజుల చొప్పున నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి.... గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 

జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి ఆన్‌–ఆఫ్‌ పద్ధతిలో వారానికి మూడు రోజుల చొప్పున నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జూరాల కుడి ప్రధాన కాలువ ద్వారా వానాకాలం పంటలకు అవసరమైన మేరకు నీటిని అందించాలని కోరారు.

ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై ప్రత్యేక ప్రచారం నిర్వహించాలి.... దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి 

ఇప్పటికే బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తున్న రైతులకు ఆన్‌–ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల చేస్తే బోర్లు రీఛార్జ్‌ అయ్యేందుకు కొంత అవకాశం ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రాజెక్టుల్లో మరమ్మతులకు గురైన మోటార్లను త్వరగా బాగు చేయించి కోయిల్‌సాగర్‌కు నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ సమస్య పరిష్కారమైతే 12 గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

రైతులు నష్టపోకుండా సాధ్యమైనంత మేరకు నీటిని అందించే చర్యలు తీసుకోవాలి... అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ 

రైతులకు నీటి విడుదలపై స్పష్టమైన సమాచారం అందించాలని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కోరారు. ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూనే, ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా సాధ్యమైనంత మేరకు నీటిని అందించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్త, నారాయణపేట కలెక్టర్ సీహెచ్. ప్రియాంక, గద్వాల కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, నాగర్‌కర్నూల్ కలెక్టర్ హిమంత కేశవ్ పాటిల్, నీటిపారుదల, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.