ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి
అధికారులకు ఎమ్మెల్యే పాల్వాయి, ఎమ్మెల్సీ దండే విఠల్ సూచన
బెజ్జూర్, (విజయక్రాంతి) బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు.ముఖ్య అతిథులుగా హాజరై మండలంలోని అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం, పారిశుధ్యం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడంతో పాటు పంటల సాగుకు అవసరమైన వసతులు, విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దండే విఠల్ కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు.
బెజ్జూర్ మండలంలోని ప్రతి గ్రామానికి సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సూచించారు. తుమ్మలగూడ గ్రామపంచాయతీలో అటవీ శాఖ అనుమతులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని సర్పంచ్ కొండ రాంప్రసాద్ సభ ముఖంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సులుగుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బాపుగూడలో విద్యుత్ సమస్య తదితర సమస్యలను సర్పంచ్ సోయం చిన్నయ్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కుకుడ గ్రామంలో విద్య, వైద్యం,అంగన్వాడి, విద్యుత్ తదితర సమస్యలను సర్పంచ్ చిరంజీవి సభాముఖంగా పలుమార్లు పరిష్కరించాలని ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ని కోరారు. సమావేశంలో బెజ్జూర్ బస్టాండ్, మరుగుదొడ్లు, కృష్ణ పల్లి నుండి గూడెం వరకు బ్రిడ్జిలు,బీటీ రోడ్డు, సలుగు పల్లి నుండి పెంచికల్పేట వరకు బీటీ రోడ్డు కు తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను సమావేశాల్లో చర్చించడానికే పరిమితం కాకుండా వాటి పరిష్కారానికి అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఇరువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ రామ్మోహన్ రావు, స్పెషల్ ఆఫీసర్ నజీమ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచ్ దుర్గం సరోజ, ఏపీవో రాజన్న, ఏవో నాగరాజు, ఎస్సై సర్తాజ్ పాషా, ఏమ్ఈఓ సునీత, ఏఈ అంజన్ కుమార్, సహకార సంఘం చైర్మన్ ఓం ప్రకాష్, మండల సర్పంచులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






