20 రోజులకు చేరిన జార్ఖండ్ విద్యార్థుల నిరసన
రాంచీ: జార్ఖండ్ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విద్యార్థులు చేపట్టిన నిరసన(Student protest) గురువారంతో 20వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. నియామక పరీక్షలలో మరింత పారదర్శకతను పాటించాలని, పలు పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐతో లేదా జార్ఖండ్ వెలుపలికి చెందిన విశ్రాంత న్యాయమూర్తుల బృందంతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ‘జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్’ ఇక్కడ జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో(Jaipal Singh Munda Stadium) నిరసన ప్రదర్శనలు చేస్తోంది. CBI విచారణ జరగాలన్న డిమాండ్‌ను వారం రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేపడతానని మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బుధవారం హెచ్చరించారు. మరోవైపు, ఈ అంశంపై 1,200కు పైగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ABVP ప్రకటించింది.
విద్యార్థి నాయకుడు రవీంద్ర(Student leader Ravindra) మీడియాతో మాట్లాడుతూ... "ఈ నిరసన కార్యక్రమం మొదలై నేటికి 20 రోజులు పూర్తయ్యాయి. నా సహచరులలో ఇద్దరు నిరాహార దీక్ష చేస్తున్నారు, మరో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా చాలా మంది నిరాహార దీక్షలోనే ఉన్నారు. ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే, మేమంతా విద్యార్థులం, కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉంచకుండా, మా డిమాండ్లను నెరవేర్చండి." అని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి పియూష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... "ఈ రోజు మేడమ్ భికైజీ కామా వర్ధంతి. విదేశాలలో భారత జెండాను ఎగురవేసిన మొదటి మహిళ ఆమె. ఆమె గౌరవార్థం మేము ఏదైనా కార్యక్రమం చేస్తాము. ప్రభుత్వం పట్ల మాకు ఆశాభావం ఉంది, అందుకే మేము ఇక్కడ కూర్చున్నాము. మా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాము." అని తెలిపారు.






