ముంచేసిన పిచ్‌లు
ఆసీస్ బోర్డుకు రూ.60 కోట్ల నష్టం
రెండు రోజుల్లోనే మ్యాచ్‌లు ఖతమ్
మెల్‌బోర్న్, డిసెంబర్ 27 : యాషెస్ సిరీస్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటు ఆస్ట్రేలియా, అటు ఇంగ్లాండ్ దేశాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రికెట్ ఫ్యాన్స్ ఈ సిరీస్‌ను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. టీవీల్లోనూ యాషెస్ సిరీస్‌లోనే రికార్డ్ వ్యూయర్ షిప్ వస్తుంది. అలాగే టెస్టులకు సైతం స్టేడియంలో రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్ అయ్యేది కూడా యాషెస్ సిరీస్‌తోనే.. అలాంటి సిరీస్ వచ్చిందంటే ఆతిథ్య క్రికెట్ బోర్డుకు కాసుల వర్షమే.. అయితే ఈ సారి సీన్ రివర్సయింది. ఊహించని విధంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కు రూ.60 కోట్ల పైన నష్టాలు వచ్చినట్టు సమాచారం.
ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌లో హోరాహోరీ పోరు కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుండగా.. చాలా మ్యాచ్‌లు ఐదోరోజు వరకూ ఉత్కంఠగా సాగుతుం టాయి. ఈ సారి మాత్రం రెండు రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ కూడా అంతే.. ఈ నేపథ్యంలో ఆసీస్ బోర్డు భారీగా టికెట్ రెవెన్యూను కోల్పోయింది. మ్యాచ్ జరిగిన రెండు రోజులు కూడా రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు.
దాదాపు 94 వేల వరకూ స్టేడియానికి అభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ మాత్రం రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో ఆసీస్ బోర్డు ఆదాయానికి భారీగా గండిపడింది. టికెట్ రెవిన్యూ మాత్రమే కాదు బ్రాడ్ కాస్టింగ్‌లో వాణిజ్య ప్రకటనల ద్వారా మూడు రోజుల ఆదాయం కోల్పోయింది. ఇప్పుడు మూడు రోజుల ముందే ఆట ముగిసిపోవడంతో ఆ ఆదాయమంతా రాకుండా పోయింది. ఈ పరిస్థితికి అక్కడి పిచ్ లే కారణం. దాదాపు బౌలింగ్ కు అనుకూలించే పిచ్‌లే రూపొందిస్తుండడంతో మ్యాచ్‌లు సగం రోజులు కూడా సాగడం లేదు. మరి చివరి టెస్ట్ మ్యాచ్ అయినా పూర్తిగా ఐదు రోజులు జరుగుతుందో లేదో చూడాలి.




