28 June, 2026 | 12:27 AM

మెదడును ఆరోగ్యంగా ఉంచుకుందాం..!

03-06-2024 12:05 AM

వాతావరణ మార్పు..

ఈ మధ్య క్లుమైట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ పదాలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇందులో వాతావరణ మార్పు మెదడు మీద తీవ్ర చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల ఆరోగ్యం పాడై పక్షవాతం, అల్జీమ ర్స్, మూర్ఛ, మల్టిపుల్ స్లీరోసిన్ లాంటి వ్యాధులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పక్షవాతం, నాడీవ్యవస్థ ఇన్‌ఫెక్షన్ల మీద వాతావరణ మార్పులు ప్రభావం చూపిస్తున్నాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో పక్షవాతం బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టుగా కొన్ని అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి.

వడగాలి లేదా విపరీతమైన చల్లదనం వంటివి మతిమరుపుకు దారితీస్తున్నట్టు కొన్ని పరిశోధనలలో తేలింది. వరదలు, కార్చిచ్చులు సైతం దీనికి అగ్నికి ఆజ్యం తోడైనట్టు రుగ్మతలకు కారణమవుతున్నాయి. మరీ దీనికి పరిష్కారం ఏంటని ఆలోచి స్తున్నారా? వేడిగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగ టం, గాలి ఆడేలా దుస్తులు వేసుకుంటే వీటి బారిన పడకుండా ఉండవచ్చు. అంతేకాకుండా సీజనల్ ఫ్రూట్స్, మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం..

రాత్రంతా నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత పరిగడుపున మొదట నీళ్లు తాగడం ఎంత మంచిదో, బ్రేక్ ఫాస్ట్ చేయడం కూడా అంతే మంచిది. కానీ కొందరు పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు బ్రేక్‌ఫాస్ట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి డైరెక్ట్‌గా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇది చాలా తప్పని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల షుగర్ లెవల్స్ పడిపోయి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక వేళ క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే మెదడులోని కణాల శక్తి, సామర్థ్యాలు తగ్గి మెదడుకు నష్టం కలగడం ఖాయం. కాబట్టి రోజంతా శరీరానికి శక్తిని, మెదడు ఆరోగ్యానికి మెడిసిన్‌లా పనిచేసే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయకండి.

నీరు తాగకపోవడం..

భూమి మీద ఎలా అయితే 71శాతం నీరు ఉంటుందో అలానే మనిషి మెదడులో 75శాతం నీరే ఉంటుంది. కాబట్టి పనిలో బిజీ ఉండడం వల్లనో పదేపదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుందనో నీరు తాగకుండా ఉండడం మంచిది కాదు. మెదడును హైడ్రేటెడ్‌గా ఉంచాలన్నా, మెదడులోని కణజాలం ఆరోగ్యంగా ఉండి సరిగ్గా పనిచేయాలన్నా రోజులో రెండు లీటర్ల నీరు తాగడం మంచిది. కచ్చితంగా నీరు ఇంతే తాగాలని లేదు.. కానీ తక్కువ మాత్రం తాగకూడదు. ఒక వేళ నీరు సరిపడా తాగకుండా ఉంటే మాత్రం మన ఆలోచన విధానం మీద తీవ్ర               ప్రభావం చూపిస్తుంది. 

ఒత్తిడికి లోనవడం..

మనిషిని అనారోగ్యం పాలు చేయడంలో ఒత్తడి కీలకపాత్ర పోషిస్తుంది. ఎక్కువ రోజులుగా ఒత్తడికి లోనవుతే ఆలోచించే శక్తి దెబ్బతింటుంది. అంతేకాకుండా ఏది సరిగ్గా గుర్తుండదు. దీంతో మతిమరుపు వస్తుంది. ఒత్తిడికి గురికాకూడదంటే తలకుమించిన భారాలు మీద వేసుకోకూడదు. జ్వరం, జలుబులాంటి అనారోగ్య సమస్యలుంటే పనికి సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం వల్ల మెదడుకు హాని జరగదు. మనం అనుకుంటుంటాం ఫిట్‌నెస్ కోసం, శారీరక దృఢత్వం కోసం వ్యాయామం చేయాలని... మెదడు ఆరోగ్యంగా ఉండాలన్న డిమెన్షియాలాంటి వ్యాధు లు రాకుండా ఉండాలన్న వ్యాయామం కచ్చితంగా చేయాలి.

హెడ్ ఫోన్స్ వాడకం..

కొందరు స్టుల్ కోసం మరికొందరు పాటలు వినడానికి ఎక్కువగా హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. మామూలు గా హెడ్ ఫోన్స్ వాడితే ఎటువంటి ప్రమాదం లేదు. పరిమితికి మించి సౌండ్ పెంచి పాటలు వింటేనే ప్రమాదం. ఎక్కువగా సౌండ్ పెట్టి పాటలు వింటే వినికిడి సమస్యలు వస్తాయి. మనిషి శరీరంలోని ప్రతీ అవయవం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి వినికిడి లోపం మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపిస్తుంది. మెదడులోని కణజాలం దెబ్బతిని అల్జీమర్స్‌లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక వేళ పాటలు పెట్టి వినాలనుకున్నా, పనిలో భాగంగా ఏదైనా ఆడియో వినాలనుకున్నా కచ్చితంగా వాల్యూమ్ 50 లేదా 60 శాతానికి మించి పెట్టకపోవడం మంచిది.

ఒంటరితనం..

కొందరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. అది అంత మంచిది కాదని వైద్యులు, అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఒంటరితనం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా, డిప్రెషన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగా ఉండేకన్నా మనల్ని అర్థం చేసుకొని మనతో కలిసిపోయే పరిచయాలను పెంచుకొని వాళ్లతో మాట్లాడాలి. ఎప్పుడూ పనిలో బిజీ లేదా నాలుగు గోడల మధ్యే ఉండకుండా పరిచయస్తులతో కానీ, కుటుంబంతో కానీ సమయాన్ని గడపడం వల్ల ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. దీంతో మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.

మెదడు చురుకుగా ఉండాలంటే..!

ఆకలిగా ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయలేము ఎందుకంటే ఆకలి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మెదడుకు, తీసుకునే ఆహారానికి సంబంధం ఉంది. జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుకుగా పనిచేయాలంటే కొన్ని ఆహార పదార్థాలను ప్రతీరోజూ డైట్‌లో చేర్చుకోవాలి. వాటిలో కోడిగుడ్లు, చేపలు, పెరుగు, వాల్‌నట్స్, డార్క్ చాక్లెట్, పాలకూర, గ్రీన్ టీ, కాఫీ వంటివి ఉంటాయి. అయితే ఏది ఎంత శాతం తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అతిగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

స్క్రీన్ టైం..

స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత టీవీల ముందు కన్నా ఫోన్‌తోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. రోజులో స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటే అది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎదిగే పిల్లలు ఫోన్‌లకు సమయాన్ని ఎక్కువ సేపు కేటాయిస్తే అది మెదడు పరిమాణంపై, అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తలనొప్పి, గందరగోళం, మెదడులో కణతులు ఏర్పడటం వంటి ఇబ్బందులు ఏర్పడతాయని అంటున్నారు. పిల్లలు, పెద్దలు అదేపనిగా ఫోన్‌కు అతుక్కుపోకూడదు. స్మార్ట్‌ఫోన్‌లలో ఈ మధ్య డిజిటల్ వెల్‌బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది.

దాన్ని ఉపయోగించుకొని ఫోన్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్స్‌కు కొంత సమయాన్ని నిర్ణయించి పిల్లలకు ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నిర్ణీత సమయం వరకు యాప్స్ పనిచేసి, స్లీప్ మోడ్‌లోకి వెళ్లి పోతాయి. పిల్లల కోసమే కాదు పెద్దలు కూడా ఇలా టైం సెట్ చేసుకొని ఫోన్ ఉపయోగించడం వల్ల స్క్రీన్ టైం తగ్గుతుంది. మెదడు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ అలవాట్లే కాకుండా ఎక్కువగా తినడం, సూర్మరశ్మి తాగలకుండా వర్క్ చేయడం లేదా ఉండడం, నెగెటివ్ థాట్స్‌లాంటివి కూడా మెదడుకు హాని చేస్తాయి. కాబట్టి సమయానికి అతిగా కాకుండా నార్మల్‌గా తినడం, ప్రతీరోజూ లేలేత సూర్యకిరణాలు శరీరానికి తాకేలా 15 నిమిషాలు వాకింగ్ చేయడం లేదా కూర్చోవడం. నెగెటివ్ థాట్స్‌కి, న్యూస్‌కి దూరంగా ఉండడం మంచిది.

ఆహారమే ఔషధం

మెదడు ఆరోగ్యానికి కోలిన్ చాలా అవసరం. ఇది జ్ఞాపకశక్తి, మానసిక స్థితి వంటి వాటికి కీలకమైన అసిటైల్ కోలిన్ అనే నాడీ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మన లివర్ కొంతవరకు తయారు చేస్తుంటుంది. కానీ మెదడు చేసే అన్ని పనులకు అది సరిపోదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుం ది. డైట్లో గుడ్లు, చేపలు, చికెన్ తీసుకుంటే.. అసిటైల్‌కోలిన్ ఎక్కువగా లభిస్తుంది. పాలు, పెరుగు, ఉడక బెట్టిన బంగాళాదుంపలు, పుట్టగొడుగులలోనూ అసిటైల్‌కోలిన్ లభిస్తుంది.

నిద్రపోకపోవడం..

మెదడుకు హాని చేసే అలవాట్లలలో నిద్రలేమి ఒక కారణంగా చెప్పుకోవాలి. ఎదిగే వయసు పిల్లలకు కానీ, పెద్దలకు కానీ నిద్ర చాలా ముఖ్యమైనది. సమయానికి పడుకుని సమయానికి మేలుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ పెద్దలు ఏడు లేదా ఎనిమిది గంట లు కచ్చితంగా నిద్రపోవాలి. రాత్రి పూట నిద్ర ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయం లో మెదడు విశ్రాంతి తీసుకొని కొత్త కణాలను సృష్టిస్తుంది. ఇది ఒక రకమైన ఛార్జింగ్ లాంటిది. దీంతో నెక్స్‌డే ఉత్సాహంగా ఉంటారు.

అయితే ఈ మధ్య నైట్‌లైఫ్‌కు అలవాటు పడిన యువత, ఉరుకుల పరుగుల జీవితంలో తలమునకలైన వారు సరిగ్గా నిద్రపోవడం లేదు. దీంతో భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ముప్పు తప్పదు. కచ్చితంగా ఏడు గంటలు నిద్రపోకపోతే ఏకాగ్రత దెబ్బతిని ఏ పని మీద దృష్టి పెట్టలేరు. చిరాకు చిరాకుగా ఉంటుంది. ఇతరు లపై కసురుకుంటారు. దీంతో బంధాలు బలహీనపడతాయి. అంతేకాకుండా సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి కూడా వస్తుంది.

మరి మెదడు రక్షణకోసం ఏం చేయాలి అనుకుంటున్నారా? మెదడును రక్షించుకోవాలంటే మీరు చేయాల్సిం ది. ప్రతీరోజూ ఏడు లేదా ఎనిమిది గంట లు కచ్చితంగా నిద్రపోవాలి. నిద్రపోయే గంట లేదా అరగంట ముందు సెల్‌ఫోన్, ట్యాబ్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు పుస్తకం చదవడం, ధ్యానం చేయడం మరీ మంచిది. నిద్రపోయే ముందు గదిలోని లైట్లు ఆఫ్ చేసి పడుకోవడం వల్ల నిద్ర బాగాపడుతుంది.

డా. ఎం.సంజీవ్ కుమార్

కన్సల్టెంట్ న్యూరోసర్జన్

మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్

04068334455