22 August, 2026 | 7:25 PM

ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం

22-08-2026 05:42 PM

- కలెక్టర్ రాజర్షిషా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్-2026’లో భాగంగా శనివారం జిల్లా స్టేడియం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

ఈ బైక్ ర్యాలీ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, మీదుగా అవగాహన కల్పిస్తూ తిరిగి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు చేరుకుంది. ముందుగా జాతీయ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థల యొక్క క్యూఆర్ కోడ్ అవగాహన  సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించి, ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ‘ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్’ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

స్క్రీనింగ్ పరీక్షలను కేవలం రిమ్స్, ఉట్నూర్, బోథ్ ప్రధాన ఆసుపత్రులకే పరిమితం చేయకుండా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా గర్భిణులు, క్షయ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూ, ఏఆర్‌టీ  కేంద్రాల ద్వారా ఉచిత చికిత్సను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆదిలాబాద్ 14వ స్థానంలో ఉందని, రాబోయే రెండు నెలల కార్యాచరణ ద్వారా జిల్లాను పూర్తి ‘సురక్షిత స్థానం’లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, యువతలో అవగాహన పెంచడంతో పాటు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ చేపడతామని, ప్రజలు 1097 హెల్ప్‌లైన్ నంబర్, క్యూఆర్ కోడ్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, డివైఎస్ఓ దయానంద్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నాగరాజు, ఐసీటీసీ కౌన్సెలర్లు, పీహెచ్‌సీల వైద్యులు, వైద్య సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.