6 May, 2026 | 6:53 PM

రైతులకు ప్రభుత్వ చేయుతపై అవగాహన కలిగి ఉండాలి

06-05-2026 06:22 PM

- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్: రైతులు ఒకే రకమైన పంట కాకుండా తరచుగా  పంట మార్పిడి, భూసారం, ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న సహకారం పై రైతుకు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే రైతు మంచి లాభాలు పొందుతూ రాజుగా ఉంటాడని లేకుంటే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వనపర్తి జిల్లా  కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగ గోపాల్ పేట మండలం సహకార సంఘం ఆధ్వర్యంలో గోపాల్పేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే, 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జిల్లాలో రైతు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, రైతు అనుబంధ శాఖలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో రైతులకు పంట సాగు పై మెళుకువలు, పంట మార్పిడి వల్ల లాభాలు, కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాల ద్వారా రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బ్యాంకు ఋణాలు తదియత అంశాల పై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందనీ చెప్పారు.

రైతులకు భూ ఆరోగ్య కార్డు (సాయిల్ హెల్త్ కార్డ్) ఇవ్వడం జరుగుతుందని, శాస్త్రజ్ఞులు రైతు పొలాన్ని పరిశీలించి భూమిలో ఉన్న సారం, భూమిలో  నత్రజని, పోటాష్, భాస్వరం తదితర  ఏ ధాతువు  తక్కువ అయ్యింది, ఏది ఎక్కువ అయ్యింది అనేదానిపై అధ్యయనం చేసి అట్టి పొలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే అంశాలను సాయిల్ హెల్త్ కార్డు ద్వారా రైతులకు తెలియపరచడం జరుగుతుందని తెలిపారు.

అందువల్ల జిల్లాలోని రైతులు అందరూ సాయిల్ హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల తాత్కాలికంగా మొక్కలు పచ్చగా ఏపుగా కనిపిస్తుంది కానీ ముద్దగా ఏర్పడి పంట దిగుబడి, నాణ్యత తగ్గిపోతుందని తెలియజేశారు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు ప్రతి రైతు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  బ్యాంకులో రైతులకు కేవలం 7-9 శాతం వడ్డీతో రుణాలు అందిస్తాయని, వాటిని సకాలంలో తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా 3 శాతం వడ్డీని తిరిగి రైతుకు చెల్లిస్తుందని చెప్పారు.

ప్రతిసారి ఒకే రకమైన పంట వేయడం వల్ల భూమి సారం కోల్పోయి దిగుబడి తగ్గిపోతుందని అందువల్ల తరచుగా పంట మార్పిడి చేస్తూ ఉంటేనే భూమి సారవంతంగా ఉండి మంచి దిగుబడి ఇస్తుందన్నారు.    భావితరాలకు సైతం మంచి సారవంతమైన భూమిని అందించాల్సిన బాధ్యత అందరూ రైతులపై ఉందన్నారు. అందువల్ల కేవలం వరి పంట సాగు మాత్రమే కాకుండా వేరు సెనగ, పామాయిల్, కూరగాయలు తదితర వాణిజ్య పంటలు సాగుచేసుకొని రైతులు లాభాలు పొందాలని సూచించారు.

జిల్లాలో గన్ని బ్యాగుల కొరత రానివ్వబోమని, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు, పశ్చిమాసియాలో యుద్ధాల వల్ల గన్ని బ్యాగుల సరఫరాలో  కొంత జాప్యం జరిగిందని దీనిని త్వరలో అధిగమించడం జరుగుతుందన్నారు. ఈరోజు రేవల్లి మండలానికి 10 వేల గన్ని బ్యాగులు పంపించడం జరుగుతుందని, మిగిలిన మండలాలకు సైతం కొరత లేకుండా చేసి వరి, మొక్క జొన్న ధాన్యం కొనుగోలును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.