10 March, 2026 | 8:05 PM

వృద్ధులకు తగిన న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటాం

10-03-2026 06:27 PM

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్

వనపర్తి,(విజయక్రాంతి): వృద్ధుల సంక్షేమ చట్టాలపై సమాజంలో  అవగాహన కల్పించి, వృద్ధులకు తగిన న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా స్థాయి కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సీనియర్ సిటిజన్స్ సమస్యలపై కమిటీ సభ్యులతో చర్చించారు.  సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు సమాజంలో వృద్ధులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై  పలు కీలక సూచనలను చేశారు. సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకునే విధంగా సంరక్షించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ సభ్యులు సూచించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపై ఉందన్నారు. జిల్లాలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ప్రభుత్వం తరఫున అట్టి సంవత్సరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. వృద్ధుల సమస్యలపై ఇప్పటి వరకు 127 ఫిర్యాదులు రాగా వాటిలో 65 పరిష్కరించామన్నారు. మిగిలిన ఫిర్యాదులు పలు దశల్లో ఉన్నాయన్నారు. వృద్ధుల కోసం జిల్లాలో డే కేర్ సెంటర్ ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యుల సూచన మేరకు సమాజంలో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదేనని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కళాజాత బృందాల ద్వారా మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టంపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సూచించారు. సమావేశంలో డి.ఎస్.పి బాలాజీ నాయక్, డిఎంహెచ్వో సాయినాథ్ రెడ్డి, డి డబ్ల్యు ఓ సుధారాణి, ఆర్డీఏ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.