సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమంకు చర్యలు
వనపర్తి,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా మార్చి 12న నిర్వహించబోయే గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్.ఖీమ్య నాయక్ తెలిపారు. మార్చి 12న నిర్వహించబోయే కౌన్సిలర్లు, సర్పంచుల ఒకరోజు శిక్షణ కార్యక్రమం విధివిధానాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతం చేయడంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచుల పాత్ర చాలా కీలకమని అందువల్ల కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచులకు మాస్టర్ ట్రైనర్ ల ద్వారా ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుంచేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ముందస్తు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు.
రెండు శేషన్లు వారిగా నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధిత మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను సైతం శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉదయం శేషన్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించాలని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్యం పై ప్రభుత్వం ఇస్తున ప్రాధాన్యత, ఆయా పథకాల ద్వారా ఆయా మున్సిపాలిటీలు, గ్రామాల్లో లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలు, ఇంకా పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై అవగాహన కల్పించాలని తెలియజేశారు.
మధ్యాహ్నం షెషన్లో బాల్య వివాహాలు, రోడ్డు భద్రత, సామాజిక రుగ్మతలను అరికట్టడం, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్. ఖీమ్య నాయక్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మార్చి 12న కొత్తగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానికంగా కళ్యాణ్ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానం పంపడం జరిగిందనీ, మార్చి 12న నిర్ధారిత ప్రణాళిక ప్రకారం శిక్షణ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి వచ్చే ప్రజా ప్రతినిధులకు మధ్యాహ్నం భోజనం సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగ వనపర్తి జిల్లాలో మొదటి థీమ్ అయిన పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో , జడ్పీ సి ఈ ఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీ నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




