కోనరావుపేటలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నివారణపై అవగాహన
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్ ఆధ్వర్యంలో యువకులకు రోడ్డు భద్రతతో పాటు మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడపకూడదని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.అలాగే కొందరు యువకులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి అలవాట్లను మానేసి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా బాధ్యతాయుతంగా జీవించాలని యువకులకు హితవు పలికారు.మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, చట్టాలను గౌరవించాలని ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీస్ సిబ్బంది జగన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.




