7 March, 2026 | 8:00 PM

ఐఐటీపై పారిశుద్ధ్య కార్మికుల బిడ్డలకు అవగాహన

01-02-2026 01:37 AM

180 చిన్నారులతో హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రత్యేక పర్యటన 

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ శనివారం పారిశుద్ధ్య కార్మికుల పిల్లల కోసం ఐఐటీ హైదరాబాద్ క్యాపస్‌లో ప్రత్యేక ఎక్స్పోజర్ విజిట్ నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ జోన్ల నుంచి ఎంపిక చేసిన 180 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని ఆరు జోన్ల ఎల్బీ నగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆరు ప్రత్యేక వాహనాల్లో ఐఐటీ క్యాంపస్‌కు తీసుకువెళ్లారు.

అక్కడ విద్యార్థులకు ఐఐటీ ప్రవేశ పరీక్షలు, ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో ఉన్న భవిష్యత్తు అవకాశాల గురించి అధ్యాపకులు విపులంగా వివరించారు. ప్రయాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిం చిన మోటివేషనల్ సెషన్‌లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.విద్యార్థులు ఐఐటీలోని అత్యాధునిక అకడమిక్ భవనాలను, నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్‌గా పేరుగాంచిన భారీ లైబ్రరీని ఆశ్చర్యంగా తిలకించారు. స్పోర్ట్స్ ,కల్చరల్ కాంప్లెక్స్‌ను సందర్శించి క్యాంపస్‌లోని విద్యార్థుల జీవనశైలిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం క్యాంపస్ మెస్లో ఐఐటీ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, అక్కడి వాతావరణాన్ని స్వయం గా అనుభవించారు. ఐఐటీలోని లెక్చర్ హాల్ కాంప్లెక్స్‌లో అధ్యాపకులు, సీనియర్ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో కెరీర్ ప్లానింగ్, కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అనే అంశాలపై చర్చించారు.నగర అభివృద్ధిలో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తిస్తూ, వారి పిల్లల భవిష్యత్తు కలలకు బాసటగా నిలవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల బిడ్డలు కూడా అత్యున్నత స్థాయికి చేరుకోవాలి. వారికి ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను చూపించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని అధికారులు పేర్కొన్నారు.