01-02-2026 01:31:13 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిస్తే.. బీఆర్‌ఎస్ పార్టీ నిరసనకు ఎందుకు పిలుపునిచ్చిందో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏమైనా దైవాంశ సంభూతుడా..? ఆయనను విచారించకూడదా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని, ట్యాపింగ్‌లో అత్యధికంగా లబ్ధిపొందింది కేసీఆరే అని అర్థమవుతోందన్నారు.
సిట్ ఏం అడుగుతుందో తెలియకుండానే బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువ హడావిడి చేస్తోందని, తెలంగాణ భవన్‌కు భారీ ఎత్తున కార్యకర్తలు రావాలని పిలుపునివ్వడం వెనుక కుట్ర కనిపిస్తోందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఒకవైపు విచారణకు సహకరిస్తామంటూనే .. మరోవైపు ఆందోళనలకు పిలుపు నివ్వడం ఎందుకు? విచారణ సమయంలో ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కల్గిస్తారన్న అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ విచారణ సమయంలో కూడా జూబ్లీహిల్స్ స్టేషన్ దగ్గర అల్లర్లు సష్టించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు.