పల్లెల్లో నుంచి గంజాయిని తరిమికొడదాం
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీఎస్పీ శివమ్ నాయుడు
ఆయా గ్రామాల్లో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అవగాహనా సదస్సు
కూసుమంచి, మార్చి 24, (విజయక్రాంతి): పల్లెల్లో నుంచి గంజాయిని, డ్రగ్స్ ను తరమికొట్టాలని, ఇది జరగాలంటే ప్రజలందరు పోలీసులకు సహాకరించాలని ఈగల్ పోర్స్ టీమ్ డీఎస్పీ శివమ్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కూసుమంచి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూసుమంచి, నాయకన్ గూడెం, నర్సింహులగూడెం, జీళ్ళచెరువు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ టీం డీఎస్పీ శివం నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ అనే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని, ఒకసారి మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని హెచ్చరించారు. చదువుకునే వయస్సులో యువత చెడు అలవాట్లకు బానిసలవకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
సమాజంలో డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా యువతతో కలిసి డ్రగ్స్కు నో చెప్పండి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం అనే ప్రతిజ్ఞ చేయించారు.
గ్రామంలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్1908 లేక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో కూసుమంచి సిఐ సంజీవ్ గారు , మండల విద్యాశాఖ అధికారి రాయల వీరస్వామి కూసుమంచి ఎస్త్స్ర నాగరాజు, ఎంపీడీవో రాజారావు, ఎక్సైజ్ ఎస్‌ఐ హేమలత, అదనపు ఎస్‌ఐ దివ్య, గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండా క్రిష్ణవేణి, ఈ కార్యక్రమంలో మండల గ్రామ సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి,ఉపాధ్యాయులు,పోలీసు సిబ్బంది, యువత, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




