హైదరాబాద్‌లో వడగళ్ల వాన
- మండుటెండలో ముంచెత్తిన వరుణుడు
- చెరువుల్లా మారిన రోడ్లు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్లలో భారీ వర్షం కురిసింది. మణికొండ, గచ్చిబౌలి, షేక్‌పేట్ ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. ఎస్‌ఆర్ నగర్, మియాపూర్, కూకట్పల్లి, చందానగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా.. సూరారం, కొంపల్లి, దుండిగల్ పరిసరాల్లోనూ వాన దంచికొట్టింది. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి.
డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్లపైకి చేరి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాల్లోలోకి నీరు చేరడంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద నీటిని మళ్లించేందుకు, రోడ్లపై నిలిచిన వాహనాలను పక్కకు తొలగించేందుకు పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్‌లో 2.40 శాతం వర్షపాతం నమోదవగా శేరిలింగంపల్లి మూసాపేట కూకట్‌పల్లి కార్వాన్ చందానగర్ రాజేంద్రనగర్ మెహదీపట్నం ఫలక్ నుమాూ ఖైరతాబాద్ శాతంగా నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మంగళవారం సాయంత్రం పలు మండలాల్లో ఒక్కసారిగా గాలిదుమరంతో భారీ వర్ష కురిసింది. నేరడిగొండ మండలం కొలరీ గ్రామంలో ఈదురుగాళ్లు వీయడంతో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి నిత్యవసర సరుకులు తడిచిపోయాయి.
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఈదురుగాలులు, వడగడ్ల వానతో చేతికొచ్చిన మొక్కజొన్న, గోధుమ పంటలకు నష్టం జరిగింది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో వడగండ్ల వానతో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్, ధనురా బి, మెండపల్లి, దేవాపూర్, గౌరాపూర్, తేజపూర్ పంచాయతీ కేంద్రాలతో పాటు అనుబంధ గ్రామాల్లో అంధకారం నెలకొంది.




