16 June, 2026 | 7:03 PM

అప్రమత్తత మనల్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతుంది

16-06-2026 06:24 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి):  ప్రతి గ్రామంలో ఒక్క ఓటు కూడా ఎవరూ నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బిఎల్ఎలకు పిలుపునిచ్చారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో టి పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై బిఎల్ఎలకు అవగాహన శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SIR ప్రక్రియ పేరుతో దేశంలోని కొన్ని రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించిన ఉదాహరణలు ఉన్నాయని ఆరోపించారు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపుతూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే చర్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి కుట్రలు జరిగే అవకాశముందని, కేంద్రంలోని బిజేపి ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.  మన రాష్ట్రంలో ఒక్క ఓటరు కూడా తన ఓటును కోల్పోకుండా కాపాడటం ప్రతి బిఎల్ఎ బాధ్యత అని స్పష్టం చేశారు. బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ, వారు అందించే ఫారాలను ప్రజలచేత సరిగ్గా నింపించి అధికారులకు సమర్పించాల్సిన బాధ్యత బిఎల్ఎ లపైన ఉందన్నారు.

ఓటర్లకు ఎల్లప్పుడూ అండగా నిలిచి, వారిలో చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో వాటిని తిప్పికొట్టాలని,  వలస వెళ్ళిన వారి వివరాలను ఓటర్ లిస్టులో ఉండేటట్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే గ్రామ స్థాయిలో ప్రతి ఓటరిని అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దాన్ని కాపాడటం ప్రతి కార్యకర్త ధర్మమన్నారు.  

అంతకుముందు బిఎల్ఎ శిక్షణ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే టి. రాంమోహన్ రెడ్డి బిఎల్ఎలకు శిక్షణ తరగతుల కార్యక్రమం లో మాట్లాడుతూ బిఎల్ఓలు గ్రామాలకు వచ్చినప్పుడు ఇతర పనులను పక్కన పెట్టి వారితో కలిసి SIR కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. నెలరోజులపాటు గ్రామాలలోనే ఉండి ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని, ఎలాంటి అలసత్వం వహించినా పార్టీకి మరియు ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.